క్యాన్సర్‌ రహిత కోవూరు నియోజకవర్గమే లక్ష్యం : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

Clock Of Nellore ( Indukuru Peta ) – క్యాన్సర్‌ రహిత కోవూరు నియోజకవర్గమే లక్ష్యంగా ఉచితంగా క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో విపిఆర్‌ ఫౌండేషన్‌, టిటిడి స్విమ్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించే మొబైల్‌ పింక్‌ బస్సును జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో వారం రోజులపాటు ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షల నిర్వహించేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. క్యాన్సర్‌ వ్యాధిపై ఉన్న భయాన్ని పారద్రోలెందుకు ఎంతో ఖరీదైన స్క్రీనింగ్‌ పరీక్షలను నియోజకవర్గంలోని ప్రజలకు ఉచితంగా చేస్తున్నట్లు చెప్పారు. ఈ మొబైల్‌ బస్సులో అత్యాధునిక అడ్వాన్స్‌డ్‌ ఎక్విప్మెంట్‌తో మూడు రకాల క్యాన్సర్‌ పరీక్షలను స్విమ్స్‌ వైద్యుల పర్యవేక్షణలో పూర్తి ఉచితంగా చేస్తున్నట్లు చెప్పారు. 35 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ చేయించుకోవాలని సూచించారు.

క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తి ఉచితంగా మెరుగైన వైద్యం అందించే అవకాశం కలుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో పర్యటించినప్పుడు క్యాన్సర్‌ రోగులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయానన్న ఆమె భవిష్యత్‌లో ఎవరూ ఇలాంటి కష్టాలు పడకూడదని ఈ పరీక్షలను ఉచితంగా చేయిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో క్యాన్సర్‌ రోగులు కూడా ఈ బస్సు వద్దకు వచ్చి రిజిస్ట్రేషన్‌ చేయించుంటే, వారికి ఆరోగ్యశ్రీ లేదా టీటీడీ ప్రాణదాన ట్రస్ట్‌ ద్వారా పూర్తి ఉచితంగా వైద్యాన్ని అందించనున్నట్లు ఆమె వివరించారు. ఈ ఉచిత స్క్రీనింగ్‌ పరీక్షలను విజయవంతం చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి ఉచిత స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించాలని, ప్రజలందరూ కూడా భయాన్ని విడనాడి ఈ పరీక్షలను చేయించుకునేందుకు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.

క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించుకోవాలి : కలెక్టర్‌ ఆనంద్
జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ మాట్లాడుతూ మంచి ఆలోచనతో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వేమిరెడ్డి దంపతులకు, టిటిడి స్విమ్స్‌ వైద్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షల ద్వారా ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించి మెరుగైన వైద్యాన్ని అందించే అవకాశం కలుగుతుందన్నారు. రెండు, మూడు దశల్లో క్యాన్సర్‌ ను గుర్తిస్తే వైద్యం చేయడం చాలా కష్టతరంగా మారుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందుగానే పరీక్షలు చేయించుకుని క్యాన్సర్‌ బారి నుంచి విముక్తి పొందాలని సూచించారు. స్విమ్స్‌ ఆధ్వర్యంలో సుమారు 25వేల మందికి ఈ పరీక్షలు నిర్వహించగా సుమారు 1500మందికి క్యాన్సర్‌ ఉన్నట్లు ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి వారందరికీ పూర్తి ఉచితంగా అత్యాధునిక వైద్యం అందించి కాపాడినట్లు కలెక్టర్‌ చెప్పారు. ప్రతిఒక్కరూ కూడా భయాన్ని వీడి ఈ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.

స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.వి.కుమార్‌ మాట్లాడుతూ రూ.10వేల వరకు ఖర్చు అయ్యే ఈ పరీక్షలను విపిఆర్‌ ఫౌండేషన్‌, స్విమ్స్‌ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 3.50 కోట్ల రూపాయల విలువైన ఈ మొబైల్‌ బస్సును స్విమ్స్‌కు విపిఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా వేమిరెడ్డి దంపతులు విరాళంగా అందించారని, ఈ మొబైల్‌ బస్సు ద్వారా ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలను అధిక సంఖ్యలో చేసి క్యాన్సర్‌ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ పెంచలయ్య, డిసిహెచ్‌ఎస్‌ రమేష్‌నాథ్‌, స్విమ్స్‌ వైద్యులు, సిబ్బంది, జిల్లా వైద్యారోగ్యశాఖ ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read Previous

గ్రామీణ ప్రాంతాల్లోనూ మెడికవర్ సేవలు : పేదలకు ఉచిత వైద్యం

Read Next

కోర్టులో లొంగిపోయిన నెల్లూరు మేయర్ భర్త జయవర్ధన్ : రిమాండ్ కు తరలింపు

Leave a Reply

Your email address will not be published.