ఒక్క రోజు శిశువుకు అపోలో హాస్పిటల్ లో అరుదైన మెదడు శస్త్ర చికిత్స విజయవంతం

  • నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ లో అద్భుతం
  • ఒక్క రోజు వయస్సున్న శిశువుకు అత్యంత అరుదైన మెదడు శస్త్ర చికిత్స
  • న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహణ
  • నెల్లూరు నగర చరిత్రలో ఇలాంటి అరుదైన ఆపరేషన్ ఇదే మొదటి సారి
  • పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయిన ఒక్క రోజు వయస్సున్న శిశువు
  • వివరాలు వెల్లడించిన న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ ఆయన బృందం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు అద్భుతం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక్క రోజు వయస్సున్న శిశువుకు అత్యంత అరుదైన మెదడు శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి పునర్జన్మను ప్రసాదించారు. నగరంలోని మరో ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవం జరిగిన సమయంలో శిశువుకు మెదడు కుడి భాగంలో భారీగా రక్తస్రావం జరిగింది. దీని వల్ల శిశువుకు ఫిట్స్ (Convulsions), స్పృహ కోల్పోవడం వంటి తీవ్ర లక్షణాలు కనిపించాయి. వెంటనే ఆ శిశువును తల్లిదండ్రులు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ కు తీసుకొచ్చారు. CT స్కాన్ పరీక్షల్లో మెదడులోని కీలక భాగాలపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్లు తేలింది. చికిత్స చేయకపోతే పక్షవాతం రావడం, వెంటిలేటర్‌పై ఆధారపడటం లేదా మరణం సంభవించే అవకాశం ఉంది. ఆ క్లిష్ట స్థితిలో శిశువును వేరే నగరానికి తరలించడం కూడా ప్రాణాపాయమని వైద్యులు గుర్తించారు. సాధారణంగా ఇంత చిన్న వయసులో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు బతికే అవకాశాలు చాలా తక్కువని వైద్య నిపుణులు చెబుతుంటారు.

తక్షణం మెదడుకు శస్త్ర చికిత్స చేయాలని న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ తల్లిదండ్రులకు తెలియజేయగా వారి అంగీకారంతో నెల్లూరు నగరంలోనే మొదటి సారిగా ఒక్క రోజు వయస్సున్న శిశువుకు ” డీకంప్రెసివ్ క్రానియెక్టమీ ” (Decompressive Craniectomy) మరియు మెదడులో పేరుకుపోయిన రక్తపు గడ్డలను తొలగించే శస్త్రచికిత్సను న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ మరియు ఆయన బృందం విజయవంతంగా నిర్వహించారు. సర్జరీ సమయంలో రక్త నష్టం, గుండె సంబంధిత సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ, పీడియాట్రిషియన్లు మరియు అనస్థీషియా నిపుణుల సహకారంతో ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. దీనిపై అపోలో హాస్పిటల్ లో గురువారం న్యూరో సర్జన్ డాక్టర్ వెంకట్ ఆయన బృందం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను తెలియజేశారు. సర్జరీ అనంతరం శిశువును క్రమంగా వెంటిలేటర్ నుండి తొలగించామని, ప్రస్తుతం బాబు చురుగ్గా ఉన్నాడని, తల్లి పాలు తాగుతున్నాడని, ఎటువంటి పక్షవాత లక్షణాలు లేవని తెలిపారు. ప్రస్తుతం శిశువు పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశామన్నారు. ఈ చికిత్సలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ బిందు భార్గవి రెడ్డి, పీడియాట్రిషియన్లు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ మహమ్మద్ రఫీ, డాక్టర్ భరత్, అనస్థీషియా విభాగం హెడ్ డాక్టర్ రాజ మోహన్ రెడ్డి మరియు వారి బృందం కీలక పాత్ర పోషించారని డాక్టర్ వెంకట్ వెల్లడించారు. మరో వైపు తమ బిడ్డ ప్రాణాలతో తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. నెల్లూరు అపోలో హాస్పిటల్ వైద్య బృందానికి జీవిత కాలం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు.

Read Previous

రూరల్ అభివృద్ధి పనుల జాతర : దామచర్లతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Read Next

వివాహేతర సంబంధం : నెల్లూరులో వ్యక్తిపై హత్యాయత్నం

Leave a Reply

Your email address will not be published.