Clock Of Nellore ( Nellore ) – వివాహేతర సంబంధం నేపద్యంలో ఓ వ్యక్తిపై నెల్లూరులో హత్యాయత్నం జరిగింది. ప్రియురాలితో కలిసి బైక్ పై వెళుతుండగా ప్రియురాలి భర్త అతనిపై కత్తితో దాడి చేశాడు. చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో అక్కడి నుండి పరారయ్యాడు. నెల్లూరు బాలాజీనగర్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు… నెల్లూరు రూరల్ మండలం, చింతారెడ్డిపాళెంకు చెందిన ఇనమాల క్రాంతి కుమార్ కు అన్నపూర్ణ అనే మహిళకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా అన్నపూర్ణ ఇంటి పక్కనే ఉన్న కర్పాటి ఆనంద్ బాబు అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ సంభందం కొనసాగుతుండగా ఇటీవల భర్త క్రాంతి కుమార్ తెలిసింది. మూడు నెలల క్రితం భార్యను హెచ్చరించాడు. దీంతో భార్య ఇంటి నుండి బయటకు వెళ్లిపోయింది. అప్పటి నుండి ప్రియుడు ఆనంద్ బాబుతో బహిరంగంగానే తిరుగుతూ కనిపిస్తూ ఉండింది. ఆటో డ్రైవర్ అయిన క్రాంతి కుమార్ దాన్ని చూసి సహించలేకపోయాడు. ఈ నేపద్యంలో గురువారం మధ్యాహ్నం భార్య అన్నపూర్ణ… ప్రియుడుతో కలిసి బైక్ పై నెల్లూరులోని హరనాథపురం వద్ద వెళుతుండగా… క్రాంతి కుమార్ గమనించాడు. వారు వెళుతున్న బైక్ ను ఆటోతో ఢీ కొట్టి ఆనంద్ బాబుపై కత్తితో దాడి చేశాడు. ముత్తుకూరు మెయిన్ రోడ్డులో జరుగుతున్న ఈ హత్యాయత్నాన్ని గమనించిన స్థానికులు పెద్దగా కేకలు వేస్తూ పోలీసులకు సమాచారం అందించారు. దాన్ని గమనించిన క్రాంతి కుమార్ అక్కడి నుండి పరరయ్యాడు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న బాలాజీ నగర్ పోలీసులు కత్తిపోట్లకు గురైన ఆనంద్ బాబును, స్వల్పంగా గాయపడిన ప్రియురాలు అన్నపూర్ణను నారాయణ వైద్యశాలకు తరలించారు. ఇద్దరికీ ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపినట్లు బాలాజీనగర్ ఇన్ స్పెక్టర్ మీడియాకు వెల్లడించారు. హత్యాయత్నానికి పాల్పడ్డ క్రాంతి కుమార్ కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.