Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పూర్వపు కమీనర్లు డి. హరిత, వికాశ్ మర్మత్ సంతకాల ఫోర్జరీ కేసులో నిందితునిగా ఉన్న నెల్లూరు మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ మంగళవారం నెల్లూరు కోర్టులో లొంగి పోయారు. న్యాయవాది సమక్షంలో ఆయన 5వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు జయవర్ధన్ ను నెల్లూరులోని సెంట్రల్ జైలుకు తరలించారు. నెల్లూరు కార్పొరేషన్ లో గతంలో కమీషనర్లుగా పనిచేసిన డి. హరిత, వికాశ్ మర్మత్ ల సంతకాలు ఫోర్జరీ చేసి భవనాల నిర్మాణాలకు సంభందించిన మార్ట్ గేజ్ లు అక్రమంగా రిలీజ్ చేసినట్లు నాలుగు నెలల క్రితం ప్రస్తుత అధికారులు గుర్తించారు. అధికారుల ఫిర్యాదుతో దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేసి పలువురు అధికారులను, ఇతర ఉద్యోగులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ కేసులో మేయర్ భర్త జయవర్ధన్ కూడా నిందితునిగా ఉన్నారు. కేసు నమోదైనప్పటి నుండి జయవర్ధన్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలించినా ఫలితం లేదు. ఇదే క్రమంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దీంతో జయవర్ధన్ మంగళవారం కోర్టులో లొంగిపోయారు. ఆయన్ను విచారించేందుకు దర్గామిట్ట పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నట్లు తెలిసింది.