Clock Of Nellore ( Atmakur ) – ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు.. మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి. రెండో కుమారుడు మేకపాటి విక్రమ్ రెడ్డితో సహా సిఎంను కలవనున్న రాజమోహన్ రెడ్డి త్వరలో ఆత్మకూరు నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికలపై చర్చించనున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరుకు ఉప ఎన్నిక అనీవార్యమైంది. దీనికి సంభందించి రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. మేకపాటి కుటుంబం నుండే ఎమ్మెల్యే అభ్యర్ధిని ఎంపిక చేయనున్నారు. మొదట్లో గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తిని పేరును ప్రకటిస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. ఆ ప్రచారాన్ని రాజమోహన్ రెడ్డి కొట్టి పారేశారు. గౌతమ్ రెడ్డి తమ్ముడు మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఈ నేపద్యంలో ఇవాళ సిఎం జగన్ ను కలవనున్న మేకపాటి రాజమోహన్ రెడ్డి.. విక్రమ్ రెడ్డి అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేయించుకుని… రాజకీయ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని చెబుతున్నారు.
మరో వైపు ఆత్మకూరు నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లా నేతలతో పాటూ ఆత్మకూరు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యి ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మేకపాటి కుటుంబసభ్యులే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే 2024లో సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుండే సమాయత్తం కావాలని నేతలకు దిశా నిర్ధేశం చేయనున్నారు.