Clock Of Nellore ( Atmakur ) – నెల్లూరుజిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల నేపద్యంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు నియోజకవర్గంలో బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. ఓటు హక్కు వినియోగంపై విద్యార్ధులకు అవగాహన కల్పించడంతో పాటూ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముందుగా ఆత్మకూరు పట్టణంలోని ఆనం సంజీవరెడ్డి డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్వీప్ (Systematic Voters Education and Electorl Participation) కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లామాట్లాడారు. ఆతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగివుండటంతో పాటు, తమ ఓటు హక్కును వినియోగించాలన్నారు. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన యువత ఓటు హక్కుపై అవగాహన కలిగి, ఓటు హక్కును పొందటంతో పాటు ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా పారదర్శకంగా తమ ఓటు హక్కును వినియోగించాలని జిల్లా కలెక్టర్, విద్యార్థులకు సూచించారు. ఓటు హక్కు పొందటం ద్వారా భారత దేశ పౌరులుగా గుర్తించబడటంతో పాటు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, బాధ్యతలు సంక్రమిస్తాయని కలెక్టర్ తెలిపారు. ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగుచున్న నేపథ్యంలో ఓటు హక్కు కలిగిన ప్రతిఒక్కరు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు. యువ ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడమే కాకుండా ఇతరులు కూడా వారి ఓటు ను వేసేలా తెలియచేయాలని కలెక్టరు తెలిపారు. అనంతరం విద్యార్ధులచే ప్రతిజ్ఞ చేయించి, పట్టణంలో విద్యార్ధులతో కలిసి ఓటు హక్కు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఆత్మకూరు పట్టణంలోని ఆది ఆంధ్ర పాఠశాలలో పోలింగ్ కేంద్రాలని కలెక్టర్ పరిశీలించారు. అలాగే జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను కూడా పరిశీలించి, ఓటర్ల వివరాలు, దివ్యాంగులు, వృద్ధులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను బూత్ లెవల్ అధికాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఏఎస్ పేట మండల కేంద్రంలోని ప్రాధమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కూడా తనిఖీ చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రమైన ఇక్కడ పోలీసు బందోబస్తును పెంచాలని సూచించారు. తర్వాత హసనాపురం వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్టును పరిశీలించి ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. చివరగా సంగం మండలం తలుపూరు పాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 198 నంబరు గల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూరు శాసనసభ ఉప ఎన్నికలు నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సజావుగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. పోలింగ్ సమయంలో ఎటువంటి అవకతవకలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు, పోలింగ్ నిర్వహణ సజావుగా రికార్డ్ చేయుటకు పక్కాగా వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఓటర్లు నిర్భయంగా ఎటువంటి ఆందోళన చెందకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. త్వరలో జిల్లాకు ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు రానున్నారన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 122 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. ఇటువంటి చోట్ల గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టడం కోసం జిల్లాకు ఐదు మిలటరీ భద్రతా దళాలు, రాష్ట్ర ప్రత్యేక పోలీసు బృందం రానున్నాయని కలెక్టర్ వెల్లడించారు.
