Clock Of Nellore ( Venkatachalam & Podalakuru ) – రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా నెల్లూరుకు విచ్చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలోని స్వగ్రామమైన తోడేరులో పర్యటించారు. ఆదివారం రాత్రి నెల్లూరుకు చేరుకోగా సోమవారం తోడేరుకు వెళ్లారు. ముందుగా సోమవారం ఉదయం వెంకటాచలం మండలంలోని గొలగమూడిలో ఉన్న భగవాన్ వెంకయ్య స్వామి ఆలయాన్ని సందర్శించారు. గొలగమూడికి వెళ్లిన కాకాణికి కంటేపల్లి వద్ద కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కంటేపల్లి వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని గుర్రపు బక్కీలో ఎక్కించి ఊరేగింపుగా గొలగమూడికి తీసుకెళ్లారు. గొలగమూడిలో వెంకయ్య స్వామికి పూజలు నిర్వహించారు.


తరువాత కసుమూరుకు చేరుకున్నారు. అక్కడ దర్గాను సందర్శించి ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం ఆయన స్వగ్రామమైన తోడేరుకు చేరుకున్నారు. ముందుగా తండ్రి కాకాణి రమణారెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించారు. తర్వాత స్వగృహానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడకు చేరుకున్న గ్రామస్తులను ఆప్యాయంగా పలకచించారు. గ్రామస్తులకు విందు భోజనం ఏర్పాటు చేయగా… అందరితో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. మధ్యాహ్నం అక్కడే విశ్రాంతి తీసుకుని సాయంత్రం తిరిగి నెల్లూరుకు చేరుకున్నారు.


