
Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుకు త్వరగా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత రోడ్డు ప్రమాదాల నివారణకు చేపడుతున్న కార్యక్రమాలను ఆర్ అండ్ బి ఎస్‌ఈ గంగాధర్ కమిటీ సభ్యులకు వివరించారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలను ప్రధాన కూడళ్లు, కళాశాలలు, హైస్కూల్‌లలో చేపడుతున్నట్లు చెప్పారు. గత సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తీసుకున్న పలు నిర్ణయాలను అమలు చేయగా, మరికొన్ని పెండింగ్‌లో వున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రోడ్డు భద్రతా కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. నెల్లూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతున్న దృష్ట్యా ఏసి కూరగాయల మార్కెట్ సెంటర్, జిల్లా పోలీసు కార్యాలయం సెంటర్, కెవిఆర్ జంక్షన్, కనకమహల్ సెంటర్, రామలింగాపురం, విఆర్‌సి ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను మే నెల మొదటివారంలోగా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఏర్పాటుచేసిన సిగ్నల్స్ వ్యవస్థలోని లోటుపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా పకడ్బందీగా సిగ్నల్ పాయింట్లను ఏర్పాటుచేయాలని సూచించారు. నగరంలో ఇంకా సిగ్నల్ పాయింట్లు అవసరమైన ప్రదేశాలను ఎంపిక చేయాలని సూచించారు. బుజబుజ నెల్లూరు నుంచి కోవూరు వరకు గల జాతీయ రహదారిపై ప్రమాదాలు జరుగుతున్న 11 ప్రాంతాల్లో సోలార్ లైటింగ్‌ను ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్ అధికారులను ఆదేశించారు. అలాగే జాతీయ రహదారిపై వాహనదారులు విశ్రాంతి తీసుకునేందుకు మనుబోలు సమీపంలో సర్వేల్యాండ్ రికార్డుల అధికారి కొన్ని ప్రదేశాలను ఎంపిక చేశారని, వీటిలో ఒక ప్రదేశాన్ని ఎంపిక చేసి వాహన దారుల విశ్రాంతి కోసం అన్ని మౌలికవసతులతో ఏర్పాట్లు చేయాలని ఎన్‌హెచ్ అధికారులకు సూచించారు.
పంచాతీరాజ్, ఆర్‌అండ్‌బి రహదారుల వద్ద స్పీడ్‌బ్రేకర్లు, పెయింటింగ్, హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. పొదలకూరురోడ్డు వద్ద డివైడర్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. జాతీయరహదారిపై మద్యం దుకాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో రద్దీ ప్రాంతాల్లో రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, ఇతర ఆక్రమణలను తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువులను రోడ్లపై వదలకుండా చూడాలని, పశువులకు రేడియం స్టిక్లర్లను ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులకు సూచించారు. జాతీయ రహదారులతో కలిసే పంచాయతీరాజ్ రహదారుల వద్ద ప్రమాదాల నివారణకు 52 ప్రాంతాల్లో భద్రతా చర్యల కోసం రూ.168లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు జేసీకి వివరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వీటిలో 33 ముఖ్యమైన ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా భద్రతా చర్యలు చేపట్టేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అలాగే ఆర్‌అండ్‌బికి సంబంధించి ప్రమాదభరిత ప్రాంతాల్లో 120 లక్షలతో భద్రతా చర్యలకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ తెలిపారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నగరంలో 3200 లైట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలుపగా, ఇంకా అవసరమైన ప్రాంతాల్లో సెంట్రల్ లైటింగ్, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను జేసీ ఆదేశించారు. వార్డు అమెనిటీ సెక్రటరీల ద్వారా సర్వే చేయించి అవసరమైన ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
ధనలక్ష్మీపురం వద్ద డివైడర్ బ్రేక్ వచ్చిన ప్రాంతాల్లో రేడియం స్టిక్కర్లు ఏర్పాటుచేయాలన్నారు. హిట్ అండ్ రన్ కేసులను త్వరగా పరిష్కరించాలని పోలీసులను ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. నెల్లూరు నగరంలో 390 సిసి కెమెరాలు పనిచేస్తున్నాయని మున్సిపల్ అధికారులు తెలుపగా, వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు పోలీసు కంట్రోల్ రూంకు అనుసంధానం చేయాలని సూచించారు. ఈ`డార్ ఆన్‌లైన్ సిస్టంలో అన్నిశాఖల అధికారులు తప్పనిసరిగా డేటా ఎంట్రీ పూర్తిచేయాలని, అన్ని హాస్పిటల్స్‌లో ఇందులో నమోదయ్యేలా చూడాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు జేసీ సూచించారు. ఈ డేటా ఆధారంగా ఏ ప్రదేశంలో ఎక్కడా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసుకుని నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నగరంలో ప్రైవేటు వాహనాలు నిలుపుదల చేసేందుకు హైవే సమీపంలోని శ్రీ వేణుగోపాలస్వామి కాలేజీని ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇందుకు దేవాదాయశాఖ నుంచి అనుమతి రావాల్సి వుందన్నారు. అలాగే మద్రాసు బస్టాండు నుంచి కలెక్టరేట్ వరకు వాహనదారులు ఇష్టప్రకారం పార్కింగ్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, దీనికి పరిష్కారమార్గం చూపుతూ పూర్తి వివరాలను వచ్చే సమావేశంలో తెలపాలని అధికారులను ఆదేశించారు. పబ్లిక్ ప్రదేశాల్లో పార్కింగ్ చేస్తున్న వారికి జరిమానాలు విధించాలన్నారు. అధికారులందకూ సమావేశంలో చర్చించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఈ సందర్భంగా జేసీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నెల్లూరు, ఒంగోలు ఎన్‌హెచ్‌ఎ పిడిలు ఎం.కె. చౌదరి, ఎం. విద్యాసాగర్, సర్వేల్యాండ్‌రికార్డుల ఎడి నాగశేఖర్, డిఎస్పీ జి. శ్రీనివాసరావు, ట్రాఫిక్ సిఐ కె రామకృష్ణ, మున్సిపల్ ఎస్‌ఈలు రామ్మోహన్‌రావు, జానీ తదితరులు పాల్గొన్నారు.