ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు

Clock Of Nellore ( Nellore ) – ప్రభుత్వ లాంఛనాలతో మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు గురువారం సాయంత్రం ముగిశాయి. అనారోగ్య కారణాలతో చెన్నైలోని అపోలో వైద్యశాలలో చికిత్స పొందుతూ ఈనెల 25వ తేదీ ఉదయం మాగుంట పార్వతమ్మ మృతి చెందిన విషయం తెలిసిందే. బుధ, గురువారాలు మాగుంట అభిమానులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల సందర్శనార్థం ఆమె పార్థీవదేహాన్ని నగరంలోని మాగుంట లే అవుట్‌లో గల ఆమె స్వగృహంలో ఉంచారు. పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయపార్టీల నాయకులు, ప్రముఖులు ఆమె పార్థీవదేహానికి నివాళులర్పించారు. పార్వతమ్మ మరిది, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని, మాగుంట కుటుంబసభ్యులను పరామర్శించారు. మాగుంట పార్వతమ్మ సేవలను గుర్తుచేసుకున్నారు. మాగుంట పార్వతమ్మ పార్థీవదేహాన్ని గురువారం సందర్శించిన వారిలో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌, మాజీ ఎంపీ పనబాకలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డి, కరణం బలరాం, కంభంపాటి విజయరామిరెడ్డి, నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, సుళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయ మాజీ చైర్మన్‌ వేనాటి రామచంద్రారెడ్డి పలువురు ప్రముఖులు ఉన్నారు.

పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు…
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలను పోలీసు లాంఛనాలతో నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ హాజరై నివాళులర్పించారు. ప్రకాశం, నెల్లూరు రాజకీయాల్లో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వుందని, ప్రజలతో మాగుంట కుటుంబానికి విడదీయలేని అనుబంధం వుందని మంత్రి గొట్టిపాటి అన్నారు. అనంతరం మధ్యాహ్నం పోలీసు లాంఛనాలతో పార్వతమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. తొలుత మాగుంట నివాసంలో పార్వతమ్మ పార్థీవ దేహానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించగా, పోలీసు బ్యాండ్‌తో నివాళులర్పించారు. భారీగా మాగుంట అభిమానులు, ప్రజాప్రతినిధులు వెంటరాగా నగరంలో కెవిఆర్‌ పెట్రోలు బంకు, ఎస్‌2 సినిమాహాలు, విజయ మహల్ గేటు నుంచి గాంధీబొమ్మ, కనకమహల్‌సెంటర్‌, ఆత్మకూరు బస్టాండు మీదుగా అంతిమ యాత్ర శ్మశానవాటికకు చేరింది. అనంతరం పోలీసులు మౌనం పాటించి గౌరవ వందనం చేశారు. పార్వతమ్మకు నివాళిగా గాల్లోకి మూడురౌండ్ల కాల్పులు జరిపి నివాళులర్పించారు. మాగుంట పార్వతమ్మ మనుమడు మాగుంట సుబ్బరామిరెడ్డి (జూనియర్) అంత్యక్రియలను పూర్తి చేశారు. ఈ అంత్యక్రియల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దామచర్ల జనార్ధన్, పలువురు ప్రజా ప్రతినిధులు, పెద్దఎత్తున మాగుంట అభిమానులు, రాజకీయపార్టీల నాయకులు పాల్గొన్నారు.

Read Previous

మంత్రి దుర్గేష్ తో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి భేటీ : పర్యాటక అభివృద్ధిపై చర్చ

Read Next

ఏపిలో ప్రభుత్వ మద్యం దుకాణాలు రద్దు : 1 నుండి రిటైల్ అమ్మకాలు

Leave a Reply

Your email address will not be published.