మంత్రి దుర్గేష్ తో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి భేటీ : పర్యాటక అభివృద్ధిపై చర్చ

Clock Of Nellore ( Venkatagiri ) – కోవూరు నియోజకవర్గంలో ఉన్న వివిధ ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు సహకరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రాష్ట్ర పర్యాటక శాఖమంత్రి కందుల దుర్గేష్‌ దృష్టికి తీసుకువెళ్లారు. వెంకటగిరి పోలేరమ్మ జాతరకు విచ్చేసిన మంత్రిని.. వెంకటగిరిలోని తెలుగుగంగ గెస్ట్‌ హౌస్‌లో మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి .. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కలిసి వివిధ అంశాలపై ఆయనకు వినతిపత్రం అందించారు. కనిగిరి రిజర్వాయర్‌ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని మంత్రి కందుల దుర్గేష్‌ కు విన్నవించారు. అదేవిధంగా ఇందుకూరుపేటలో ఉన్న మైపాడు బీచ్‌ నుంచి కొత్త కోడూరు వరకు రహదారిని అభివృద్ది చేయాలని కోరారు. దీని ద్వారా రెండు ప్రాంతాల మధ్య పర్యాటకం అభివృద్ది చెందుతుందని ఆమె వివరించారు. అలాగే దక్షిణ భారత సబర్మతిగా పేరుగాంచిన పల్లిపాడులోని పినాకినీ గాంధీ ఆశ్రమాన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించి అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరారు. ఈ గ్రామాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి దత్తత తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, దానికి తోడు రాష్ట్ర పర్యాటక శాఖ తరఫున ఆశ్రమాన్ని, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే వినతులపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. ఆయా ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Read Previous

నేత్రపర్వంగా వెంకటగిరి పోలేరమ్మ జాతర : దర్శించుకున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు

Read Next

ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన మాగుంట పార్వతమ్మ అంత్యక్రియలు

Leave a Reply

Your email address will not be published.