Clock Of Nellore ( Gudluru ) – వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమేనని, మంచి రోజులు ముందున్నాయని నెల్లూరు పార్లమెంటు టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి గుడ్లూరు లోని కళ్యాణ మండపంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో ప్రవేశించిన నేతలకు మండల టిడిపి అధ్యక్షులు జనిగర్ల నాగరాజు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులు ఇచ్చారు. వలేటి మాలకొండయ్య, ప్రసాద్ లు నేతలను గజమాలతో సత్కరించగా… స్థానికులు అక్కడి నుంచి వారిని ర్యాలీగా పార్టీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. కమ్మ పాలెంలోని రామాలయం, వడ్డెపాలెంలోని అంకమ్మ తల్లి ఆలయాల్లో నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ పెద్దలు వారిని సత్కరించారు.
భారీ స్థాయిలో టిడిపిలోకి చేరికలు…
స్థానిక టిడిపి కార్యాలయం, తర్వాత గుండా శ్రీనివాసులు కళ్యాణ మండపాల్లో జరిగిన కార్యక్రమాలలో అధికార వైసీపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు, కార్యకర్తలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో గుడ్లూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పారా జనార్ధన్… దప్పలంపాడు గ్రామానికి చెందిన కందుకూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెరుకూరి సూర్యనారాయణ, వలేటి నరసింహం… గుండ్లపాలెం గ్రామానికి చెందిన చెవుటూరి రమేష్, చెంచయ్య, ఇంకా అమ్మవారిపాలెం వాసులు టిడిపిలో చేరారు. పువ్వాడి వేణు, రావూరి వేణు, మేకపోతుల రాఘవులు ఆధ్వర్యంలో గుడ్లూరులోని బిసి, ఎస్సి, ఎస్టి కాలనీ వాసులు, ఇంకా మండలంలోని పలు గ్రామాల నుంచి వందల సంఖ్యలో తరలివచ్చి అధికార పార్టీ కార్యకర్తలు పసుపు కండువాలు కప్పుకున్నారు.
ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ఉగాది పర్వదినం రోజు మీ అందరితో ఇలా సమావేశం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎవరు అధైర్యపడవద్దని, వచ్చేది మన ప్రభుత్వమేనని అన్నారు. వైసీపీ అరాచకాలు ఆగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో దాదాపు 15 వేల సచివాలయాలు ఉండగా 1.26 లక్షల మంది ఎంప్లాయిస్ పనిచేస్తున్నారని, వారందరితో పింఛన్లు పంపిణీ చేయిస్తే అసలు ఇబ్బందులే వచ్చేవి కాదన్నారు. కానీ వైసీపీ వికృత ఆలోచనలతో అనేకమంది వృద్ధులను, దివ్యాంగులను ఇబ్బంది పెట్టిందని విమర్శించారు. ఉమ్మడి ప్రభుత్వం వస్తే వృద్ధులకు, వితంతువులకు 4000 పెన్షన్ అందిస్తారని, వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారానే ఇంటింటికి పెన్షన్లు అందిస్తారన్నారు. నెల్లూరు ఎంపీగా తాను గెలిస్తే పరిశ్రమలు తీసుకువచ్చి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కందుకూరు ఎమ్మెల్యేగా నాగేశ్వరావు గారిని, ఎంపీగా తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.
గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ, నియోజకవర్గ పరిశీలకురాలు కుసుమకుమారి, ఒంగోలు డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు పువ్వాడి శ్రీనివాసులు, స్థానిక నాయకులు పువ్వాడి వేణు, రావూరి వేణు, మేకపోతుల రాఘవులు, దామా వెంకటేశ్వర్లు, చెన్నారెడ్డి మహేష్, పార్టీ నాయకులు మద్దసాని కృష్ణ, పొట్టేళ్ల మురళి, చిత్తారి మల్లికార్జున, పువ్వాడి శ్రీనివాసులు, తాటిపర్తి రామకృష్ణ, ఉమ్మనేని సుబ్బారావు, ఏసుదాసు, ఉమ్మడిపోలు కోటేశ్వరరావు, జొన్నలగడ్డ రమణమ్మ, సింగమనేని పద్మ, అల్లం సుమతి తదితరులు పాల్గొన్నారు.
