Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ అసెంబ్లీ టిడిపి అభ్యర్ధి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ఆయన ప్రచార వాహనంలో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. అంత ఎండలోనూ ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టి ఆశీర్వదిస్తున్నారు. పోలింగ్ కు సమయం 33 రోజులు మాత్రమే ఉండటంతో కోటంరెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బుధవారం ఆయన 33, 34, 35వ డివిజన్లలో ప్రచారం నిర్వహించారు. ముందుగా 33వ డివిజన్ లోని వెంగళరావునగర్ కు వెళ్లగా స్థానిక ప్రజలు ఆయనకు పూలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ తన కుటుంబం మొత్తం మిమ్మల్నే నమ్ముకుని ఉందని అన్నారు. మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఇలాగే ఉండాలని అంటూ వచ్చే నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్ధించారు. తన కోసం ఈ 33 రోజులు కష్టపడి పనిచేయాలని, వచ్చే ఐదేళ్లు మీ కోసం నేను కష్టపడతానని విజ్ఞప్తి చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన మొదటి మూడు నెలల్లోనే పొదలకూరు రోడ్డును అందమైన, సుందరమైన రోడ్డుగా తీర్చిదిద్దుతానని కోటంరెడ్డి హామీ ఇచ్చారు. ప్రస్తుతం వైసీపి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని, ఈ కష్టాలు పోవాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో లేని వ్యక్తులకు ఓటు వేయవద్దని, నిత్యం మీ కోసం అందుబాటులో ఉండే తనను దీవించాలని కోరారు. తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 34, 35వ డివిజన్లలో ప్రచాం నిర్వహించారు. వైసీపి పాలనలో అధోగతిపాలైన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి అభివృద్ధిలోకి రావాలంటే అనుభవజ్ఞులైన చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు. వైసీపి నేతల బెదిరింపులకు వాలంటీర్లు భయపడవద్దని, రాజీనామాలు చేయవద్దని సూచించారు. వాలంటీర్ల వ్యవస్థ యథావిధిగా కొనసాగుతుందని, గౌరవ వేతనం కూడా 10వేలు ఇవ్వనున్నారని వెల్లడించారు. ఎంపిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, ఎమ్మెల్యేగా తనకు సైకిల్ గుర్తులపై ఓట్లు వేసి గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోటంరెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
