Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నాను. త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. నెల్లూరుజిల్లా వైసీపి అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సిఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కేతంరెడ్డి వైసీపి కండువా కప్పుకోనున్నాను. నెల్లూరుజిల్లా జనసేన పార్టీలో వర్గ విభేదాల కారణంగానే కేతంరెడ్డి పార్టీ మారుతున్నట్లు సమాచారం. జనసేన పార్టీని నెల్లూరులో బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసిన తనకు పార్టీలో కనీస గుర్తింపు కూడా లభించలేదని కేతంరెడ్డి వాపోయినట్లు తెలిసింది. 2018లో కాంగ్రెస్ ను వీడి జనసేన పార్టీలో చేరిన వినోద్ రెడ్డి 2019లో జరిగిన ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. అక్కడి నుండి పార్టీలో విభేదాలు మొదలయ్యాయి. పార్టీ జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డితో పొసగక స్వంతంగానే కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. తర్వాత కేతంరెడ్డి వినోద్ రెడ్డి సిటీ నియోజకవర్గంలోని ప్రతీ ఇంటిని సందర్శించి పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యంతో పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. 316 రోజుల పాటూ పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్విగ్నంగా నిర్వహించారు. ఎండా వానా తేడా లేకుండా ప్రతీ రోజూ ప్రజల మధ్యనే తిరిగారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వీలైనంత మేర అభ్యర్ధులను బరిలోకి దింపారు. తర్వాత జరిగిన పరిణామాల నేపద్యంలో వినోద్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. కనీసం సిటీ నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతలు కూడా అప్పగించలేదు. దీనిపై పార్టీ పెద్దల వద్ద చర్చ జరగ్గా వినోద్ రెడ్డికి ఎలాంటి హామీ ఇవ్వలేదని దాంతో మనస్థాపం చెందిన వినోద్ రెడ్డి గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీలో కేవలం కొందరు వ్యక్తులు, ఒక సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు వినోద్ రెడ్డి మనస్థాపానికి గురైనట్లు తెలిసింది. ఈ పరిణాలను పరిశీలించిన రాజ్యసభ సభ్యులు, నెల్లూరు వైసీపి జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి… వినోద్ రెడ్డిని వైసీపిలోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఇప్పటికే మంతనాలు పూర్తయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. త్వరలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపిలో చేరుతారని స్పష్టంగా తెలుస్తోంది. ఒక వేళ ముఖ్యమంత్రి కాకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమక్షంలోనే పార్టీలో చేరే అవకాశం ఉంది.
ఇదీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి రాజకీయ ప్రస్థానం !
చిన్న తనం నుండే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న వినోద్ రెడ్డి విద్యాభ్యాసం సమయంలోనే కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగమైన NSUI చేరారు. NSUI గూడూరు నియోజకవర్గ అధ్యక్షునిగా 2003 నుండి 2005 సంవత్సరం వరకూ పనిచేశారు. తర్వాత నెల్లూరుకు చేరిన వినోద్ రెడ్డి కార్పొరేట్ అడ్వర్టైజ్ మెంట్ బిజినెస్ ను సాగించారు. ఆ క్రమంలోనే ఆనం వివేకానందరెడ్డి శిష్యుడిగా చేరిపోయారు. ఆయన వద్ద అనేక రాజకీయ మెళుకువలు నేర్చుకున్నారు. వినోద్ రెడ్డి రాజకీయ చతురతను గుర్తించిన ఆనం వివేకానందరెడ్డి… 2006లో యూత్ కాంగ్రెస్ లో అవకాశం కల్పించారు. నెల్లూరు వర్కింగ్ కమిటిలో చోటు ఇచ్చారు. తనదైన శైలిలో యూత్ కాంగ్రెస్ పనిచేసిన వినోద్ రెడ్డి సేవలను గుర్తించిన యూత్ కాంగ్రెస్ జాతీయ కమిటి ఆయన్ను 2008లో రాహుల్ గాంధీ చేపట్టిన యువబాటలో భాగస్వాముల్ని చేసింది. సుమారు రెండు నెలల పాటూ వినోద్ రెడ్డి… రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. ఆనం వివేకానందరెడ్డి ఆశీస్సులతో 2009లో జిల్లా కాంగ్రెస్ పార్టీ పబ్లిసిటీ విభాగం అధ్యక్షునిగా, 2012లో యూత్ కాంగ్రెస్ నెల్లూరు అధ్యక్షునిగా పనిచేశారు. 2014లో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నారు. 2015లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కో – ఆర్డినేటర్ గా సేవలు అందించారు. 2016 నుండి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. 2017లో నెల్లూరులో నిర్వహించిన భూగర్భ డ్రైనేజీ, తాగునీటి ప్రాజెక్టు పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ సేవ్ నెల్లూరు పేరుతో దాదాపు సంవత్సరం పాటూ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. సేవ్ నెల్లూరు కార్యక్రమం వినోద్ రెడ్డికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ క్రమంలో అప్పటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పనబాక కృష్ణయ్యతో రాజకీయ విభేదాలు రావడంతో కాంగ్రెస్ ను వీడిని వినోద్ రెడ్డి 2018లో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వినోద్ రెడ్డి చేరిన సమయంలో నెల్లూరుజిల్లాలో జనసేన పార్టీ అంతంత మాత్రంగానే ఉండింది. ఆ సమయంలో వినోద్ రెడ్డి జనసేనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు కేతంరెడ్డికి పవన్ కళ్యాణ్ అవకాశం కల్పించారు. వైసీపి అభ్యర్ధి అనీల్ కుమార్ యాదవ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి పాలైనా పార్టీ కార్యక్రమాలను చురుగ్గానే నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపద్యంలో సొంత పార్టీలోని నేతలతో కేతంరెడ్డికి విభేదాలు ఏర్పడ్డాయి. విభేదాలు కాస్తా ముదిరి అధినేత వద్దకు పోయాయి. దీంతో ఆయన్ను సిటీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా ప్రకటించకుండా చేశాయి. అప్పటి నుండి ఏ హోదా లేకపోయినా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. పవనన్న ప్రజాబాట పేరుతో 316 రోజులు నిర్విగ్నంగా గడప గడపకూ వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. పార్టీలో వర్గ విభేదాలు కొనసాగడం… దానిపై పార్టీ పెద్దలు కలగజేసుకోకుండా మౌనంగా ఉండటంతో పార్టీలో వినోద్ రెడ్డికి ఇటీవల ప్రాధాన్యత తగ్గింది. ఈ పరిణాలతో మనస్థాపం చెందిన వినోద్ రెడ్డి ఇటీవల నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. త్వరలో వైసీపిలో చేరనున్నారు.

