Clock Of Nellore ( Chittoore ) – తూర్పు రాయలసీమ ( చిత్తూరు – నెల్లూరు – ప్రకాశం ఉమ్మడి జిల్లాలు ) ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. సమీప పిడిఎఫ్ అభ్యర్ధి బాబురెడ్డిపై 1043 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. చిత్తూరులోని ఆర్వీఎస్ లా కళాశాలలో ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. శుక్రవారం తెల్లవారు జాము 3 గంటల వరకూ ప్రాధాన్యతా క్రమంలో లెక్కింపును చేపట్టారు. విజయానికి రావల్సిన మొదటి ప్రాధాన్యతా ఓట్లు ఎవ్వరికీ రాకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. రెండవ ప్రాధాన్యత ఓట్లతో కలిపి మొత్తం వైసీపి అభ్యర్ధి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి 11వేలా 714 ఓట్లు రాగా, పిడిఎఫ్ అభ్యర్ధి పొక్కిరెడ్డి బాబురెడ్డికి 10వేలా 671 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపి అభ్యర్ధి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 1043 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు అధికారులు ధృవీకరించారు. చిత్తూరు కలెక్టర్ ఎం. హరినారాయణ డిక్లరేషన్ అందజేశారు.
మరో వైపు తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఈ ప్రక్రియ ఈ రాత్రికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ జరిగిన కౌంటింగ్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్ చౌదరి ముందంజలో ఉన్నారు. వైసీపి అభ్యర్ధి పేర్నాటి శ్యాం ప్రసాద్ పై సుమారు 20వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో ముందుకు దూసుకుపోతున్నారు. ఇంకా ఓట్లు లెక్కించాల్సి ఉంది. విజయానికి కావల్సిన మొదటి ప్రాధాన్యత ఓట్లు రాకుంటే రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు. రెండవ ప్రాధాన్యత ఓట్లలో కూడా మెజార్టీ వస్తుందని, శ్రీకాంత్ చౌదరి విజయం ఖాయమని తెలుగుదేశం అంచనా వేస్తుంది.