Clock Of Nellore ( Nellore ) – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ వైసీపి రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సైకిలెక్కబోతున్నారు. ఈనెల 24వ తేదీనా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి… అవకాశం వస్తే తెలుగుదేశంలో చేరి ఆ పార్టీ ద్వారా పోటీ చేయాలని ఉందని బహిరంగంగానే ప్రకటించారు. ఈ క్రమంలో ముందుగా ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి టిడిపి తీర్ధం పుచ్చుకుంటున్నారు. ఎన్నికల సమయానికి శ్రీధర్ రెడ్డి కూడా టిడిపిలో చేరనున్నారు. ఈనెల 24వ తేదీనా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి భారీ కార్ల ర్యాలీతో మంగళగిరికి వెళ్లనున్నారు. కోటంరెడ్డి అనుచరులు కూడా అదే రోజు టిడిపిలో చేరనున్నారు. మంగళగిరిలోని టిడిపి రాష్ట్ర కార్యాలయంలో 24వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు గిరిధర్ రెడ్డి పసుపు కండువా కప్పుకోనున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆయన్ను టిడిపిలోకి సాదరంగా ఆహ్వానించనున్నారు. అయితే ఈ చేరిక కార్యక్రమంలో జిల్లాకు చెందిన టిడిపి నేతలు ఎవరెవరు హాజరవుతారో ఇంకా క్లారిటీ రాలేదు.