Clock Of Nellore ( Nellore ) – దేశం యొక్క నిజమైన శక్తి దేశ ప్రజల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపక ఛైర్మైన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి అన్నారు. దేశ శక్తిని చాటేందుకు గానూ ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా అపోలో హాస్పిటల్స్ దేశ సేవలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి తన సందేశాన్ని తెలియజేశారు. అంతే కాకుండా ” హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026 ” పేరుతో నివేదికను విడుదల చేశారు. దేశంలో మారుతున్న ఆరోగ్య మార్పులను తెలియజేశారు. గతంలో వృద్దాప్యంలో వచ్చే మధుమేహం, గుండె పోటు లాంటి వ్యాధులు నేడు 20 నుండి 30 ఏళ్ల వయసు వారిలోనే కనిపిస్తున్నాయని, వ్యాధి లక్షణాలు బయటపడకముందే శరీరం లోపల ఆ వ్యాధి తాలూకు అనారోగ్యం ముదిరి, పరిస్థితి విషమించో వరకూ వస్తుందన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోకపోవడం, ప్రాణాంతక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించలేకపోవడమే దీనికి కారణమని డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి వివరించారు. అంటు వ్యాధుల కంటే అంటువ్యాధులు కాని వ్యాధులు (NCDs – Non-Communicable Diseases) అంటే క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, ఊబకాయం వంటిని దేశంలో “సైలెంట్ కిల్లర్స్”లా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తమ ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, తరచుగా ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలను ప్రాధమిక దశలోనే గుర్తించి చికిత్స అందించవచ్చునని పేర్కొన్నారు.
అపోలో ” హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026 ” నివేదికలో దేశంతో పాటూ ఆంధ్రప్రదేశ్ మరియు నెల్లూరుకు సంబంధించిన ఆరోగ్య పరీక్షల గణాంకాలను తెలియజేశారు. రాష్ట్రంలో 27.0% మంది మధుమేహం (Diabetes) బాధపడుతున్నారని, 22.5% మంది అధిక రక్తపోటు (Hypertension), 4.2% మంది రక్తహీనత (Anaemia), 81.8% మంది ఊబకాయం (Obesity & Overweight), 56.7% మంది డిస్లిపిడెమియా (Dyslipidemia) అంటే రక్తంలో అధికంగా కొవ్వు ఉన్న సమస్యలతో బాధపడుతున్నట్లు తెలియజేశారు. నెల్లూరు సిటీకి సంబంధించి పరీక్ష చేయించుకున్న వారిలో 27.6% మందికి మధుమేహం ఉందని (Diabetes), 29.2% మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని, 21.3% మందిలో రక్తహీనత ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. నెల్లూరులో 85.3% మంది అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపతున్నారని, అత్యధికంగా 73.8% మందిలో కొలెస్ట్రాల్ లేదా లిపిడ్ స్థాయిలు అసాధారణంగా ఉన్నట్లు తేలిందని డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య సమస్యలను అవి ముదిరే వరకు వదిలేయకుండా, ప్రాథమిక దశలోనే గుర్తించి నివారించడం ద్వారా ప్రతి భారతీయుడు ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగించవచ్చని అపోలో నివేదిక స్పష్టం చేస్తోంది.