Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లాలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామ్స్ రామారావు జిల్లాలో పరీక్షల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను కలెక్టర్ కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ జిల్లాలో 172 పరీక్షా కేంద్రాల్లో 29401 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఏప్రిల్ మూడో తేదీ నుంచి 18 తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రూట్ ఆఫీసర్లు ముందుగానే అన్ని పరీక్షా కేంద్రాలను క్షుణ్ణంగా పరిశీలించి చెక్ లిస్ట్ ప్రకారం అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా పరీక్షా కేంద్రాల్లో ఏ ఒక్క విద్యార్థికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు సమకూర్చాలన్నారు. విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు, కుర్చీలు వంటి వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల సమీపంలో జెరాక్స్ షాపులను మూసివేసి 144 సెక్షన్ ను అమలు చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేందుకు 10 ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందాలను, 18 మంది రూట్ ఆఫీసర్లను, 18 మంది అదనపు రూట్ ఆఫీసర్లను, పరీక్షా కేంద్రాల్లో పర్యవేక్షణకు 172 మంది చీఫ్ సూపరింటెండెంట్ లను, 172 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను నియమించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

ఏప్రిల్ 3 నుంచి ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలు !
ఏప్రిల్ 3వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ చక్రధర్ బాబు తెలిపారు. పదో తరగతి సంబంధించి 1207 మంది విద్యార్థులు, 3090 మంది ఇంటర్ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వారు నిర్వహించే ఈ పరీక్షలకు హాజరుకానున్నారని, వీరికి 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఓపెన్ ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పరీక్షల నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో చిరంజీవి, ఆర్ఐఓ వరప్రసాద్, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.