ఈనెల 16న తేలనున్న MLC ఫలితాలు : వైసీపి గెలిస్తే చరిత్రే !

Clock Of Nellore ( Buero Report ) – ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలకు సోమవారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తిరుపతిలోని రెండు పోలింగ్ బూత్ లలో మాత్రమే ఇవాళ రీ పోలింగ్ సాగుతుంది. మొత్తంగా చూస్తే ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లే. ఈనెల 16వ తేదీనా ఓట్ల లెక్కింపును అధికారులు చేపట్టనున్నారు. 16వ తేదీ అర్ధరాత్రికి గానీ, 17 తేదీ ఉదయానికి గానీ తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. గతంలో ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో తమ అభ్యర్ధులను బరిలోకి దించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన మండలి పునరుద్ధరణ తర్వాత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ తమ అభ్యర్ధులను బరిలోకి దించలేదు. పట్టభద్రుల స్థానాలకు మాత్రమే అభ్యర్ధులను నిలబెట్టేవారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్ధులను పోటీకి దించారు.

ఇక తూర్పు రాయలసీమ ( చిత్తూరు – నెల్లూరు – ప్రకాశం ఉమ్మడి జిల్లాలు ) పట్టభధ్రుల, ఉపాధ్యాయ స్థానానికి సంభందించి చూస్తే… 6 మంది అభ్యర్ధులు కీలకంగా మారారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అధికార వైసీపి అభ్యర్ధిగా నెల్లూరుకు చెందిన కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధినేత పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎవ్వర్నీ బరిలోకి దించలేదు. యుటిఎఫ్ అభ్యర్ధి ఎల్.సి. రమణారెడ్డికి మద్దతు ప్రకటించింది. పిడిఎఫ్ అభ్యర్ధిగా పొక్కిరెడ్డి బాబురెడ్డి బరిలో ఉన్నారు. ఉపాధ్యాయ స్థానానికి జరిగిన పోలింగ్ లో నెల్లూరుజిల్లాలో 88.36 గా పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ శాతం పెరగడం ఎవరికి లాభమో అభ్యర్ధులు చర్చించుకుంటున్నారు. పోలింగ్ శాతం పెరగడం తమకే లాభిస్తుందని అధికార వైసీపి, పిడిఎఫ్ లు ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. రాష్ట్రంలో శాసన మండలి పునరుద్దరణ తర్వాత ఇప్పుడు జరుగుతున్న ఎన్నిక 4వ ది. గతంలో మూడు సార్లు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక జరగ్గా ఒక్క సారి కూడా రాజకీయ పార్టీలు విజయం సాధించలేదు. అప్పటి కాంగ్రెస్ సైతం ఎవ్వర్నీ పోటీకి కూడా దించలేదు. తెలుగుదేశం కూడా ఎవ్వర్నీ ఇంత వరకూ బరిలోకి దించలేదు. ఈ రెండు పార్టీలు ఉపాధ్యాయ సంఘాల అభ్యర్ధులకే మద్దతు ప్రకటించేవి. తొలిసారిగా 4వ దఫా జరిగిన ఈ ఎన్నికల్లో వైసీపి తన అభ్యర్ధిని బరిలోకి దించింది. ఈ ఎన్నికల్లో అధికార వైసీపి అభ్యర్ధిగా బరిలోకి దిగిన చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధిస్తే చరిత్ర సృష్ఠించినట్లవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ చేయలేదు. నేడు తొలిసారిగా వైసీపి తమ అభ్యర్ధిని బరిలోకి దించింది. విజయం సాధిస్తే చరిత్రే కదా. విజయమో… ఓటమో… ఈ నెల 16వ తేదీనా తేలనుంది.

మరో వైపు తూర్పు రాయలసీమ ( చిత్తూరు – నెల్లూరు – ప్రకాశం ఉమ్మడి జిల్లాలు ) పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంభందించి అధికార వైసీపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీతో పాటూ పిడిఎఫ్ అభ్యర్ధి కూడా బరిలో ఉన్నారు. పది మందికి పైగా పోటీ చేసినా వారిలో ప్రధానంగా ముగ్గురి మధ్య గట్టిపోటీ ఉంది. వైసీపి అభ్యర్ధిగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా కంచర్ల శ్రీకాంత్ చౌదరి, పిడిఎఫ్ అభ్యర్ధిగా మీగడ వెంకటేశ్వర్లు రెడ్డి పోటీలో ఉన్నారు. ముగ్గురి మధ్య గట్టి పోటీనే నెలకొంది. గతంలో మూడు సార్లు పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగ్గా ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీ అభ్యర్ధి విజయం సాధించలేదు. ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్ధులే విజయం సాధిస్తూ వచ్చారు. తాజాగా ఈ స్థానాన్ని తాము కైవసం చేసుకోబోతున్నామని వైసీపి అభ్యర్ధి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఈ స్థానంలో వైసీపి అభ్యర్ధి విజయం సాధిస్తే అది కూడా చరిత్రే.

ఇది శాసనమండలి చరిత్ర !
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా శాసన మండలి 1958 జూలై 1వ తేదీనా ఏర్పాటైంది. తర్వాత నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయ్యాక 1985 మే నెల 31వ తేదీనా మండలిని రద్దు చేశారు. ఆ తర్వాత ఎవ్వరూ దాన్ని పునరుద్ధరించలేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో శాసన మండలి పునరుద్ధరణకు అడుగులు ముందుకు వేశారు. ఆయన కృషితో రాష్ట్రంలో తిరిగి 2007 మార్చి 30వ తేదీనా మండలి పునరుద్ధరణ అయింది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో శాసనమండలిలో 90 ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా.. రాష్ట్ర విభజన తర్వాత ఆ స్థానాలు 58 అయ్యాయి. వీటిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు 5, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు 5 ఉంటాయి. స్థానిక సంస్థల నుండి 20 మంది ఎమ్మెల్సీలు ఎన్నికవుతారు. ఎమ్మెల్యేలు 18 మందిని ఎన్నుకుంటారు. వివిధ విభాగాల నుండి 10 మందిని గవర్నర్ మండలికి నామినేట్ చేస్తారు. మొత్తంగా మండలిలో 58 మంది ఎమ్మెల్సీలు ఉంటారు. శాసన మండలి పునరుద్దరణ తర్వాత ఇప్పటి వరకూ మూడు దఫాలు ఎన్నికలు జరగ్గా తాజాగా జరిగిన ఎన్నిక 4వ ది.

Read Previous

ముగిసిన వైసీపి అభ్యర్ధుల ఎమ్మెల్సీ నామినేషన్లు : చిత్తూరులో భారీ ఊరేగింపు

Read Next

అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైసీపి తిరుగుబాటు ఎమ్మెల్యేలు

Leave a Reply

Your email address will not be published.