తుఫానుపై మంత్రి కాకాణి సమీక్ష : అధికారులు అప్రమత్తంగా ఉన్నారని వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – మాండోస్ తుఫాను నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరులోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్.పి. విజయ రావు లతో కలిసి మంత్రి జిల్లా అధికారులతో మాండోస్ తుఫాను సహాయక చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మాండోస్ తుఫాను నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ సంబంధిత అధికారులు అందరూ ఎటువంటి పరిస్థితులనయినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉన్నారని అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు ఇప్పటికే చేపట్టారని వివరించారు. ముఖ్యంగా మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లకుండా ఇప్పటికే వారిని అప్రమత్తం చేయడం జరిగిందని చేపల వేటకు వెళ్లిన వారిని తిరిగి రప్పించడం జరిగిందని చెప్పారు. పాఠశాలలకు కూడా ఈరోజు ప్రభుత్వ సెలవు ప్రకటించామని, రేపు ఎల్లుండి రెండు రోజులు ప్రభుత్వ సెలవులేనన్నారు. జిల్లాలో వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించామన్నారు. జలమయమయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

తుఫాను షెల్టర్లు, పునరావాస కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. ఎక్కడైనా నీరు నిలిచి ఉంటే తొలగించేందుకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అలాగే పారిశుధ్యం సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. వృద్ధులు, పిల్లలకు అవసరమైన మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచడం జరిగిందని, నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వర్షపు నీటిని తొలగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఖరీఫ్, ముందస్తు రబి పంటలు సాగవుతున్న దృష్ట్యా వర్షాల కారణంగా రైతులు ఇబ్బంది పడకుండా ఈ పంట నమోదు కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని వ్యవసాయ అధికారులకు సూచించినట్లు మంత్రి పేర్కొన్నారు. సోమశిల, కండలేరు రిజర్వాయర్ల నుంచి నీటిని క్రమబద్ధంగా విడుదల చేయాలని ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీటిని విడుదల చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించరాదని స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇచ్చామన్నారు. ఎక్కడైనా సాగునీటి కాలువలు బలహీనంగా ఉంటే గమనించి వాటిని పటిష్టం చేయాలని సూచించామన్నారు. విద్యుత్ స్తంభాలు ఎక్కడైనా పడిపోతే వెంటనే పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని, జెసిబి లు, జనరేటర్లు, విద్యుత్ రంపాలు తదితర సామాగ్రిని జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంచుకుందన్నారు. ఎక్కడైనా అవసరమైతే సహాయక చర్యలు చేపట్టేందుకు, ప్రమాదాలు నివారించేందు కోసం జిల్లాకు రెండు ఎన్ డి ఆర్ ఎఫ్ , ఒక ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు అందుబాటులో సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుందని, ఎవరైనా సరే వర్షాలు తుఫాను సంబంధించి ఏదైనా సమాచారం తెలియజేయడానికి జిల్లాలో కంట్రోల్ విభాగం 1077 టోల్ ఫ్రీ నెంబర్ తో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే నివారించడానికి మండలాల్లో ప్రత్యేక అధికారులను నియమించామన్నారు.

అంతకు ముందు జిల్లా కలెక్టర్ మంత్రికి వివరిస్తూ జిల్లాలో మాండోస్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో గత నాలుగు రోజులుగా జిల్లా అధికార యంత్రాంగం అంతా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిందన్నారు. జిల్లా కేంద్రంలో 1077 టోల్ ఫ్రీ నెంబర్ తో కంట్రోల్ విభాగం మూడు రోజుల నుండి పనిచేస్తుందని అన్ని ప్రభుత్వ శాఖల నుండి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే మండలాల్లో కూడా కంట్రోల్ విభాగాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని ప్రభుత్వ శాఖల నుండి సిబ్బందికి విధులు కేటాయించడం జరిగిందన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను అప్రమత్తం చేశామని గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సేవలు అందించాలని సూచించామన్నారు. ఆపదమిత్రలను తుఫాను సహాయక చర్యల్లో భాగస్వాములను చేస్తున్నామన్నారు. సోమశిల, కండలేరు జలాశయాల్లో ఇన్ ఫ్లోను బట్టి నీటిని దిగువకు విడుదల చేసేందుకు నిరంతరం సిబ్బంది విధులు నిర్వహించే విధంగా ఏర్పాటు చేశామన్నారు. ప్రజలను అప్రమత్తం చేశామని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశామన్నారు. చెరువులన్నీ పూర్తిగా నిండాయని పొంగిపొర్లితే తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై సూచనలు ఇచ్చామన్నారు.

బియ్యము, నూనె పప్పు, ఉప్పు తదితర నిత్యవసర సరుకులు కావలసినంత సిద్ధంగా అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో గత 24 గంటలుగా వర్షం కురుస్తోందని సరాసరి 2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయిందన్నారు. జిల్లాలో చెట్లు పడిపోయి రహదారుల్లో రాక పోకలకు అంతరాయం కలగకుండా చెట్లు వెంటనే తొలగించేందు కోసం జెసిబి లు, విద్యుత్ రంపాలు జనరేటర్లు సిద్ధంగా ఉంచుకున్నామని పెట్రోలు డీజిల్ బంకుల యజమానులతో మాట్లాడి అవసరమైనంత సిద్ధంగా ఉంచుకున్నామని చెప్పారు. జిల్లాలో భారీ వర్షాల గురించి ప్రజలకు ముఖ్యంగా రైతులకు సమాచారం అందించి అప్రమత్తం చేశామన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ రోనంకి కూర్మానాద్, నగర కమిషనర్ హరిత, కందుకూరు సబ్ కలెక్టర్ శోభిక, అదనపు ఎస్పీలు హిమవతి, శ్రీనివాసరావు, డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, నెల్లూరు, కావలి, ఆత్మకూరు ఆర్డీవోలు మలోల, శీనా నాయక్, కరుణకుమారి, తెలుగు గంగ ప్రాజెక్టు సీఈ హరి నారాయణరెడ్డి, డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ పెంచలయ్య, జెడ్ పి సి ఈ ఓ చిరంజీవి డిఎస్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్, జలవనరుల, విద్యుత్ శాఖల ఎస్ ఈ లు రంగ వరప్రసాద్, అశోక్ కుమార్, కృష్ణమోహన్, వెంకటసుబ్బయ్య, సోమశిల ఎస్.ఈ. రమణారెడ్డి, పశుసంవర్ధక శాఖ జెడి మహేశ్వర్ రెడ్డి,జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు తదితర అధికారులు పాల్గొన్నారు.

Read Previous

వైసీపిలోకి రాచాల రవికుమార్ : ఎమ్మెల్యే కోటంరెడ్డితో భేటీ

Read Next

శ్రీధర్ రెడ్డి మాటలకు అర్ధాలే వేరయా ! : ధ్వజమెత్తిన అబ్ధుల్ అజీజ్

Leave a Reply

Your email address will not be published.