![](https://clockofnellore.com/wp-content/uploads/2022/12/Cyclone.jpg)
Clock Of Nellore ( Buero Report ) – ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న మాండౌస్ తీవ్ర తుఫాను స్వల్పంగా బలహీన పడి సాధారణ తుఫానుగా మారింది. ఇది ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుంది. చెన్నైకు 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై గంటకు 12 కిలో మీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తుంది. ఇవాళ రాత్రి 9 గంటల ప్రాంతంలో తుఫాను… వాయుగుండంగా బలహీన పడి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట – తమిళనాడులోని మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాను ప్రభావంతో తమిళనాడులోని 12 జిల్లాలతో పాటూ దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఉమ్మడి నెల్లూరుజిల్లా, చిత్తూరు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరుజిల్లాలోని వాకాడు సముద్రతీరంలో సముద్రం 50 మీటర్ల మేర ముందుకొచ్చింది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు వణికి పోతున్నారు. గత అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తుఫాను తీరం దాటినప్పటికీ దాని ప్రభావంతో శని, ఆదివారాల్లో కూడా ఓ మోస్తారు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ నిపుణులు తెలియజేశారు. మరో వైపు ఉమ్మడి నెల్లూరుజిల్లాలో ఈదురు గాలుల ధాటికి అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్ధంబాలు, ట్రాన్స్ ఫార్మర్లు నేలకొరిగాయి. విభజిత తిరుపతి జిల్లాలో శుక్రవారం విద్యా సంస్థలకు జిల్లా కలెక్టర్ శెలవు ప్రకటించారు.