Clock Of Nellore ( Nellore Rural ) – పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను తప్పనిసరిగా నాటాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం నెల్లూరు రూరల్ మండలంలోని నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో చేపట్టిన జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంలో జిల్లా సామాజిక అటవీ శాఖ అధికారి శ్రీనివాసులుతో కలిసి కలెక్టర్ మొక్కలను నాటారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 12.10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించామని, ఈ మేరకు ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతగా ఒక మొక్కను తప్పనిసరిగా నాటాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో, కళాశాలల్లో, పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. జిల్లాలోని 9 నర్సరీలో అవసరమైన మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమకు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్తీకమాసంలో వృక్షాలను నాటడం ఆనవాయితీ అని, ఆ మేరకు ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా మొక్కలు నాటడం తమ బాధ్యతగా భావించాలన్నారు. అనంతరం శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ ఆలయ అర్చకులు కలెక్టర్ కు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలకగా, స్వామి వారిని కలెక్టర్ దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సామాజిక అటవీ శాఖ అధికారి డి శ్రీనివాసులు, జిల్లా దేవాదాయ శాఖ అధికారి శ్రీనివాసులు రెడ్డి, వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ చైర్మన్ వేమిరెడ్డి సురేంద్ర రెడ్డి, అటవీ శాఖ అధికారులు శివ రామకృష్ణ, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
