Clock Of Nellore ( Nellore ) – తెలుగుదేశం పార్టీ దళిత నేత మాతంగి కృష్ణ, వైసీపి దళిత నేత కుమార్ హరికుమార్ పై దాడులు దురదృష్ఠకరమని వైసిపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. ఈ రెండు దాడులు వ్యక్తిగత కక్ష్యల మూలంగా జరిగాయా, రాజకీయపరమైన దాడులా… లేదంటే రియల్ ఎస్టేట్ గొడవలా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉందన్నారు. నెల్లూరులోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం గిరిధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రెండు దాడులను తమతో పాటూ తమ సోదరులు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రంగా ఖండించామని గుర్తు చేశారు. ఈ దాడులపై టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు సమంజసం కాదని హితవు పలికారు. పోరాటాల గురించి తెలుగుదేశం పార్టీ వారి నుండి నేర్చుకోవాల్సిన పరిస్థితి తమకు లేదని, తమ సోదరులు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విద్యార్ధి నేత స్థాయి నుండి ఎదిగారని గుర్తు చేశారు. ఐదు సార్లు ఎన్నికల్లో ఓటమిపాలైన సోమిరెడ్డి రాజకీయ నీతులు చెప్పడం హస్యాస్పదంగా ఉందని, సొంత డివిజన్ లో కార్పొరేటర్ ను కూడా గెలిపించుకోలేని పరిస్థితిలో వారున్నారని పేర్కొన్నారు. నెల్లూరు టిడిపి పార్టీలో ఉండే వారంతా పేపర్ పులులని అంటూ తప్పుడు కేసులు పెట్టించే సంస్క్రృతి తమది కాదని గిరిధర్ రెడ్డి స్పష్టం చేశారు. విమర్శలు చేసేటప్పుడు ఆలోచించాలని, వాస్తవ పోరాట యోధుడైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మీరు వ్యంగ్యంగా చెప్పినట్లు కావాలంటే సినిమా తీసుకోండని, కలెక్షన్లు కూడా మీరే తీసుకోండని సెటైర్లు వేశారు. ఈ విలేకరుల సమావేశంలో 25వ డివిజన్ కార్పొరేటర్ బద్దెపూడి నరసింహ గిరి, 24వ డివిజన్ వైసీపి నేత అరవ శ్రీను పాల్గొన్నారు.