Clock Of Nellore ( Nellore ) – నవంబర్ 7వ తేదీనా కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నెల్లూరులో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. 1008 మంది మహిళలతో కార్తీక దీపాలతో శోభాయాత్ర నిర్వహించడంతో పాటూ నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద గణేష్ నిమజ్జన ఘాట్ వద్ద దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. గురువారం గణేష్ నిమజ్జన ఘాట్ వద్ద భక్త బృందాలు, మహిళలతో కలిసి కార్తీక దీపోత్సవ ఏర్పాట్లను శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నభూతో న భవిష్యత్ అన్నట్లుగా గణేష్ నిమజ్జన కార్యక్రమం ఏ విధంగా జరిగిందో దానికి రెట్టించిన విధంగా నవంబర్ 7వ తేదీనా 1008 మంది మహిళలతో కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కేరళ మహిళల పంబ మేళ, కోలాటాలు, మహిళా మంగళ వాయిద్యాలు, వివిధ రకాల సంస్క్రృతిక ప్రదర్శనతో నగరంలో శోభాయాత్రను నిర్వహిస్తామని, గణేష్ నిమజ్జన ఘాట్ వరకూ శోభాయాత్ర సాగుతుందని అనంతరం హరిద్వార్ నుంచి వచ్చిన అర్చకులు గంగా హారతి ఇస్తారన్నారు. ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోటంరెడ్డి పిలుపునిచ్చారు.
