నెల్లూరులో అంగరంగ వైభవంగా అష్టాదశ శక్తి పీఠాల శోభాయాత్ర…

Clock Of Nellore ( Nellore ) – సింహపురి సీమలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా అమ్మవారి శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. అష్టాదశ శక్తి పీఠాల నుంచి తీసుకు వచ్చిన చీర, కుంకుమ, అక్షింతలు, అభిషేక జలాలు, నెయ్యి వంటివి సారె రూపంలో ఊరేగింపుగా శ్రీ రాజ రాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వరకు తీసుకువచ్చారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులు స్వయంగా ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. మూడు పల్లకిల్లో అమ్మవారు, ఆదిశంకరాచార్యులు వారు, అష్టాదశ శక్తి పీఠాల సారే శోభాయమానంగా ఆలయానికి చేరుకుంది. టిటిడికి చెందిన వాద్య కళాకారులు, నాట్య కళాకారుల స్వర నిరాజనాలతో ఆద్యంతం కళాకారులు, గుర్రాల విన్యాసాలు, అమ్మవారి నామస్మరణల మధ్య జరిగిన ఊరేగింపు తో సింహపురి ఆధ్యాత్మిక శోభతో అలరాడింది.

భక్తుల సందర్శనార్థం…
అష్టాదశ శక్తి పీఠాల నుంచి వచ్చిన సారెలను శుక్రవారం రాత్రి రాజరాజేశ్వరి అమ్మవారి గర్భాలయంలో ఉంచుతారు. రేపటి నుంచి అంటే శనివారం ఉదయం నుంచి రెండు రోజులపాటు భక్తులందరూ దర్శించుకునేందుకు వీలుగా ఆలయ ధ్వజస్తంభం వద్ద అష్టాదశ శక్తి పీఠాల సారెను ఏర్పాటు చేసి పూజలు జరుపుతారు. ఈ రెండు రోజులపాటు 18 అష్టాదశ శక్తి పీఠాలు నుంచి వచ్చిన సారెను ప్రతి ఒక్క భక్తుడు చూసే అవకాశాన్ని రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కల్పించారు. సాధారణంగా అందరికీ ఈ 18 అష్టాదశ శక్తి పీఠాలను దర్శించుకోవడం సాధ్యమయ్యే పని కాదు. అలాంటి వారందరికీ ఈసారెను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా వేద పండితులు చెబుతున్నారు. అష్టాదశ శక్తి పీఠాల సారెను ఇక్కడ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డికి భక్తులు అభినందనలు తెలుపుతున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అష్టాదశ శక్తి పీఠాల మహా శోభాయాత్ర నెల్లూరులో నిర్వహించడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఊరేగింపు ఘట్టం అద్భుతంగా సాగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నగర మేయర్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Read Previous

జనవరిలో నాలుగు లైన్ల రహదారికి శంఖుస్థాపన : మాజీ మంత్రి అనీల్

Read Next

చిల్డ్రన్స్ పార్కు ప్రాంత అభివృద్ధికి కృషి : వెల్లడించిన మాజీ మంత్రి అనీల్

Leave a Reply

Your email address will not be published.