Clock Of Nellore ( Atmakur ) – ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి( సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో సోమవారం ముఖేష్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తో కలసి ఆత్మకూరు నియోజక వర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించి పోలింగ్, కౌంటింగ్ ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, సంగం మండలం, దువ్వూరు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును సందర్శించి నిర్వహిస్తున్న రిజిస్టర్స్ ను పరిశీలించారు. చెక్ పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దువ్వూరులోని 228, 229 నెంబర్ మోడల్ పోలింగ్ కేంద్రాలను సిద్దీపురం లోని 225 నెంబర్ పోలింగ్ కేంద్రాన్ని, ఆత్మకూరు మండలం వాసిలి గ్రామంలోని 151, 152 నెంబర్ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఓటర్ స్లిప్ ల పంపిణీ తదితర విషయాలను పోలింగ్ బూత్ స్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పోలింగ్ రోజున ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి కావాల్సిన త్రాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల వసతి తదితర ఏర్పాట్లను సీఈఓ పరిశీలించారు.

అనంతరం ముఖేష్ కుమార్ మీనా, ఆత్మకూరులోని ఆంధ్రా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్లో చేపట్టిన ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడుతూ, ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అన్నీ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. భారత ఎన్నికల సంఘం జారి చేసిన మార్గ దర్శకాలు ఖచ్చితంగా అమలు జరిగేలా ప్లైయింగ్ స్క్వాడ్, ఎం.సి.సి టీములు, స్టాటిక్ సర్వైలెన్స్ టీములు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీఈఓ తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ కు సంబంధించి చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఈ రోజు దువ్వూరు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును పరిశీలించడం జరిగిందన్నారు. అలాగే దువ్వూరు, సిద్దీపురం, వాసిలి గ్రామాల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్స్ స్లిప్స్ ఎంతవరకు ఓటర్స్ కు పంపిణీ చేసారు, ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేందుకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించారు అని పరిశీలించడం జరిగిదన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఆంధ్రా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ ను పరిశీలించినట్లు సీఈఓ తెలిపారు. ఈ పర్యటనలో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్, ఆత్మకూరు ఆర్.డి.ఓ బాపిరెడ్డి, మునిసిపల్ కమీషనర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
