Clock Of Nellore ( Nellore ) – ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పకడ్బందీగా చేపట్టిందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) ముఖేష్ కుమార్ మీనా సంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం నెల్లూరు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు ఉప ఎన్నికల నేపథ్యంలో సోమవారం తాను ఆరు పోలింగ్ స్టేషన్లు, ఆత్మకూరు ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను, కౌంటింగ్ హాలును పరిశీలించానన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్ బాబు నేతృత్వంలో నోడల్ అధికారులు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టారని సంతృప్తి వ్యక్తం చేశారు. తాను పరిశీలించిన పోలింగ్ స్టేషన్లలో విద్యుత్, తాగునీరు, టాయిలెట్స్, వికలాంగులకు ర్యాంపులు మొదలైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. అలాగే 279 పోలీంగ్ స్టేషన్లను మరొకసారి పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా నోడల్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
21వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెర పడనుందని, ఆత్మకూరు నియోజకవర్గం సరిహద్దు ప్రాంతాల నుంచి రానున్న 48 గంటల సమయంలో ఆత్మకూరు నియోజకవర్గంలోకి ఇతరులు ఎవరిని కూడా అనుమతించకూడదన్నారు. 123 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా గట్టి బందోబస్తు చర్యలు జిల్లా ఎస్పీ విజయరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఆబ్సెంట్, వలస, మృతి చెందిన ఓటర్ల జాబితాను అంటించడంతో పాటు పోలింగ్ ఏజెంట్లకు అందించనున్నట్లు చెప్పారు. ఎన్నికలకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, ఇప్పటి వరకు ఎనిమిది ఫిర్యాదులు నమోదు కాగా అన్నింటినీ పరిష్కరించినట్లు చెప్పారు. అలాగే 1950 కాల్ సెంటర్ కూడా 24 గంటలు పనిచేస్తుందని, ఓటర్లు తమ సందేహాలను ఈ నెంబర్ కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అత్యంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. అనంతరం ఓటర్లను చైతన్య పరిచే గోడపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి హరేంధిర ప్రసాద్, జిల్లా ఎస్పీ విజయ రావు, మున్సిపల్ కమిషనర్ జాహ్నవి, డిఎఫ్ఒ షణ్ముఖ కుమార్, డిఆర్ఓ వెంకట నారాయణమ్మ పాల్గొన్నారు.
