Clock Of Nellore ( Amaravathi ) – నెల్లూరు కోర్టులో చోరీ ఘటనపై ఇవాళ హైకోర్టు సుమోటో విచారణ జరిపింది. ( Nellore Court Theft Case Issue ) కేసును సీబీఐకి అప్పగించడంపై అభ్యంతరం లేదని విచారణలో భాగంగా అడ్వకేట్ జనరల్(ఏజీ) కోర్టుకు తెలిపారు. దీంతో డీజీపి, మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, సీబీఐ డైరెక్టర్, సీఎస్‌లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని డీజీపిని ఆదేశించింది. కేసు దర్యాప్తు నివేదిక పరిశీలించాక నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మే 6కు వాయిదా వేసింది.
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసు ఆధారాలు నెల్లూరు నాలుగో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు నుంచి చోరీకి గురైన ఘటన రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను రాష్ట్ర హైకోర్టు సుమోటో పిల్‌గా స్వీకరించింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు సరైన దిశలో జరగడం లేదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే) ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకొని ఉన్నత న్యాయస్థానం సుమోటో పిల్‌గా పరిగణించి ఇవాళ విచారణ జరిపింది.