Clock Of Nellore ( Kasumuru ) – నెల్లూరుజిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని కసుమూరులో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కసుమూరు మండలంలోని చింతలపాళెం, శ్రీరామపురంలో రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్లారు. అక్కడ వాటికి తాళాలు వేసి ఉండటంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తామని అక్కడ ప్రదర్శించి ఉన్న ఫ్లెక్సీని మీడియాకు చూపించి… ఆర్బీకేలు అలంకార ప్రాయమేనా అని మండిపడ్డారు.

అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతున్నా… ఇక్కడ మాత్రం కొనే దిక్కే లేదని అన్నారు. ప్రభుత్వం చెప్పేదొకటి, క్షేత్ర స్థాయిలో జరిగేది ఒకటని విమర్శించారు. ప్రభుత్వ తీరు వల్ల ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేలు రైతులను విస్మరించి భూ కుంభకోణాలు, గ్రావెల్, ఇసుక మాఫియాలతో బిజీగా మారిపోయారని ఆరోపించారు. వారం రోజుల నుండి తాను గూడూరు, సూళ్లూరుపేట, ఉదయగిరి ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని, ఎక్కడికి వెళ్లినా పుట్టి 12వేలకే రైతులు నష్టానికి అమ్ముకుంటున్నారని చెప్పారు. మద్దతు ధర 16వేలా 660 రూపాయలు ఉండగా ప్రభుత్వ తీరుతో రైతులు కేవలం 12వేలకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం ఇదన్నారు.
