Clock Of Nellore ( Nellore ) – విజ్ఞాన భాండాగారాలయిన గ్రంథాలయాలను బలోపేతం చేయడం ద్వారా జిల్లా గ్రంధాలయ సంస్థకు పూర్వ వైభవం తీసుకొస్తామని ఆ సంస్థ నెల్లూరు జిల్లా చైర్ పర్సన్ దొంతు శారద పేర్కొన్నారు. బుధవారం నెల్లూరు స్టోన్ హౌస్ పేట లోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయ ప్రాంగణంలో ఆ సంస్థ చైర్ పర్సన్ దొంతు శారద ఆధ్వర్యంలో పుస్తక ఎంపిక కమిటీ సభ్యులతో సమావేశం జరిగింది. నూతనంగా కొనుగోలు చేయనున్న పుస్తకాలను పరిశీలించి అన్ని వర్గాల పాఠకులకు ఉపయోగపడే విధంగా 2021 – 22 సంవత్సరానికి గాను 79 లక్షల రూపాయల విలువగల పుస్తకాలను ఎంపిక చేశారు. వీటిని కలకత్తాలోని రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ వారి నుండి డిస్కౌంట్ ధరలకు తెప్పించాలని తీర్మానించారు. 2022 – 23 సంవత్సరానికి గాను సైటేషన్ నంబర్లు లేని తాజా పుస్తకాలు కొనుగోలు చేయుటకు 20 లక్షల రూపాయలు కేటాయించారు.
ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ దొంతు శారద మాట్లాడుతూ జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో గ్రంధాలయాల భవనాల కోసం 98 .50లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇందులో జిల్లా గ్రంధాలయం కోసం 50 లక్షల రూపాయలు, కోవూరు గ్రంధాలయం కోసం 20 లక్షల రూపాయలు, జలదంకి గ్రంధాలయం కోసం28.50 లక్షలు రూపాయలు వ్యయం చేస్తున్నామన్నారు. అలాగే ప్రతి గ్రంథాలయంలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కంప్యూటర్లు ఇంటర్నెట్ సౌకర్యంతో ఏర్పాటు చేసేందుకు 50 లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నామన్నారు. నూతనంగా ఎంపిక చేసిన పుస్తకాలను పది రోజుల్లోగా తెప్పిస్తామని జిల్లా మంత్రి, జిల్లా కలెక్టర్ సమక్షంలో నూతన పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలో చేపడతామన్నారు. కొనుగోలు చేస్తున్న పుస్తకాల్లో 50 శాతం పోటీ పరీక్షలు వ్రాసే విద్యార్థుల కోసం, 30 శాతం మహిళల కోసం, 10 శాతం పిల్లల కోసం, మరో పది శాతం సాధారణ పుస్తకాల కోసం ఖర్చు చేయడం జరుగుతుందన్నారు.
ప్రస్తుతం వయోజనులు గ్రంథాలయాలకు బాగానే వస్తున్నారన్నారు. గత కొంత కాలంగా గానీ, ఇటీవల కాలంలో కరోనా పరిస్థితుల వలన గాని విద్యార్థులకు గ్రంధాలయాలు ఉన్నాయనే విషయం తెలియడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రానున్న రోజుల్లో గ్రంథాలయాల్లో నెలకోసారి విద్యార్థులకు పలు అంశాలపై పోటీలు నిర్వహించి గ్రంథాలయాల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రిన్సిపాల్ లు, ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులను చైతన్య పరిచి ఆదివారం ఒకరోజు గ్రంథాలయాలకు వచ్చే అలవాటును కలిగిస్తామన్నారు. గ్రంథాలయాల్లో 50 శాతం పుస్తకాలను బ్యాంకులు, గ్రూప్ 1, 2, 4 , ఐఏఎస్ వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడే అధ్యయన పుస్తకాలను అందుబాటులో ఉంచడం జరుగుతోందన్నారు. అలాగే సమకాలీన అంశాలకు సంబంధించిన డిజిటల్ కాపీలను కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. ఎవరైనా సరే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలకు వెళ్లి జీవన శైలి ఎలా ఉండాలి, వ్యక్తిత్వ వికాసం ఎలా పెంపొందించుకోవాలి, విజయతీరాలకు ఎలా చేరుకోవాలి, ఆత్మవిశ్వాసంతో ఎలా మెలగాలి అనే అంశాలపై విద్యార్థులకు వివరించి గ్రంథాలయాల పట్ల మొగ్గు చూపే విధంగా ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.
ఇందుకోసం జిల్లా కలెక్టర్ సహకారంతో జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తామన్నారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ల వ్యవస్థను వినియోగించుకోనున్నామన్నారు. అంతే కాకుండా కోళ్ల ఫారం, ప్రయోగశాల, నర్సింగు తదితర ఒకేషనల్ కోర్సులకు అవసరమైన పుస్తకాలను కూడా గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ సమావేశంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సిహెచ్ ప్రసాద్, సమాచార పౌర సంబంధాల శాఖ ఉప సంచాలకులు వెంకటేశ్వర ప్రసాద్, డీకే డబ్ల్యూ ప్రభుత్వ కళాశాల తెలుగు, రాజకీయ శాస్త్రం, జంతు శాస్త్రం లెక్చరర్లు డాక్టర్ కరుణశ్రీ, జోజి, డాక్టర్ ఎన్ అనిత, గూడూరు ఎస్ కే ఆర్ డిగ్రీ ప్రభుత్వ కళాశాల చరిత్ర లెక్చరర్ డాక్టర్ జి సురేంద్ర పాల్గొన్నారు.
