Clock Of Nellore ( Nellore ) – నిన్న హైదరాబాద్ లో గుండెపోటుతో కన్నుమూసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని ఇవాళ నెల్లూరులోని వారి నివాసానికి తీసుకొచ్చారు. నిన్న ఉదయం నుండి ఇవాళ ఉదయం వరకూ హైదరాబాద్ లోని వారి నివాసంలో ఉంచగా ఇవాళ ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి భారత వాయుసేన హెలికాప్టర్ లో నెల్లూరుకు తీసుకొచ్చారు. హైదరాబాద్ ఇంటి వద్ద నుండి ఉదయం 7: 45 గంటలకు అంబులెన్స్ లో గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని బేగంపేట విమానాశ్రయానికి తీసుకెళ్లారు. తర్వాత 9: 45 గంటలకు అక్కడి నుండి హెలికాప్టర్ నెల్లూరుకు బయలుదేరింది. ఉదయం 11: 52 గంటలకు హెలికాప్టర్ నెల్లూరులోని పోలీసు కవాతు మైదానానికి చేరుకుంది. ప్రత్యేక అంబులెన్స్ ద్వారా సమీపంలోని మేకపాటి గౌతమ్ రెడ్డి నివాసానికి భౌతిక కాయాన్ని తీసుకెళ్లి ప్రజల సందర్శనార్ధం ఉంచారు. మంత్రి అనీల్ కుమార్ యాదవ్ దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. గౌతమ్ రెడ్డిని చివరిసారిగా చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు.


