Clock Of Nellore ( Delhi ) – ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు జీడిపప్పు ఎగుమతిని సులభతరం చేయడానికి ఏం చర్యలు తీసుకున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి అనుప్రియ పటేల్ రాతపూర్వకంగా సమాధానమిస్తూ జీడిపప్పు ప్రాసెసర్ ల దుస్థితికి సంబంధించి ఎటువంటి సమాచారం అందలేదని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఇప్పటి వరకు నిర్దేశిత వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సహాయానికి వ్యవసాయ ఉత్పత్తుల – ఎగుమతికి రాష్ట్ర, జిల్లా స్థాయిలో అనేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నిర్దిష్ట ప్రణాళికలతో రాష్ట్ర స్థాయి కమిటీలు, నోడల్ ఏజెన్సీలు, అనేక రాష్ట్రాల్లో క్లస్టర్ స్థాయి కమిటీలు కూడా ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఎగుమతుల ప్రోత్సాహానికి ఉత్పత్తి – నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలు కూడా రూపొందాయని తెలిపారు. రైతులు, రైతు – ఉత్పాదక సంస్థలు, సహకార సంఘాలు, ఎగుమతిదారులు పరస్పరం వ్యవహరించడానికి ఒక పోర్టల్ ను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. క్లస్టర్లలో కొనుగోలుదారు – విక్రేతల సమావేశాలను నిర్వహిస్తున్నట్లు, వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా ప్రతినిత్యం వివరాలను తెలుసుకునే అవకాశం కలిగించినట్లు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు వాణిజ్య శాఖ సహాయ పడుతోందని పేర్కొన్నారు.