Clock Of Nellore ( Vijayawada ) – రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం విజయవంతమైందని పీఆర్సీ సాధన సమితి నేతలు అన్నారు. ఈనెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించిన అడ్డంకులను అధిగమించి వేలాదిగా ఉద్యోగులు విజయవాడకు తరలివచ్చారు. ‘చలో విజయవాడ’ ఆందోళనతో బెజవాడ వీధులు ఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు.. ఎన్జీవో హోం నుంచి అలంకార్ థియేటర్ మీదుగా బీఆర్‌టీఎస్ కూడలి వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి.
పీఆర్సీ జీవోలను రద్దు చేయాల్సిందేనంటూ ఉద్యోగులు చేస్తున్న నినాదాలతో బీఆర్‌టీఎస్ రోడ్డు మార్మోగింది. పీఆర్సీ జీవోలను రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు. ప్రభుత్వం తమను అణచివేసే ప్రయత్నాలు చేస్తే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని హెచ్చరించారు. హక్కుల సాధనకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ‘వుయ్ వాంట్ జస్టిస్’.. ‘అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలు రద్దు చేయాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
అంతకుముందు ‘చలో విజయవాడ’ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. బారికేడ్లు పెట్టి ఉద్యోగులను అడ్డుకున్నారు. అయినప్పటికీ కొందరు ఉద్యోగులు మారువేషాల్లో విజయవాడ వెళ్లేందుకు యత్నించారు. నెల్లూరు రైల్వేస్టేషన్‌లో ఆత్మకూరు మండలానికి చెందిన ఓ ఉద్యోగి అంగవైకల్యం ఉన్న వ్యక్తి వలే మారు వేషంలో వెళ్తుండగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు ఉద్యోగులు కూలీల మాదిరిగా రైల్వే స్టేషన్లకు చేరుకున్నారు. వారిలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరికొందరు వారి కళ్లు గప్పి విజయవాడ చేరుకున్నారు.