Clock Of Nellore ( Buchi ) – చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక అక్రమ కేసుల భయం లేకుండా గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి చేసి చూపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కలిసి బుచ్చిరెడ్డిపాలెం పట్టణం వవ్వేరులో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గ్రామానికి చేరుకున్న ఎంపీ, ఎమ్మెల్యేకి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రేషన్ కార్డులు, కొత్తగా పెన్షన్ నమోదుకు సంబంధించిన పలు సమస్యలను గ్రామస్థులు వారి దృష్టికి తెచ్చారు. వేమిరెడ్డి దంపతుల ఆదేశాలతో బుచ్చిరెడ్డిపాళెం తహసీల్దార్, ఎంపిడిఓ పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు.
అనంతరం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పెన్షన్ పంపిణి సందర్భంగా అవ్వా తాతల ముఖాల్లో ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. నాయకుల మధ్య వర్గపోరు గ్రామాభివృద్ధికి ప్రధాన ఆంటంకమన్నారు. నాయకులు ఐకమత్యంగా ఉండి గ్రామాభివృద్ధికి పాటు పడాలని హితవు పలికారు. అభివృద్ధి మరియు సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న చంద్రబాబు నాయుడు పాలనలో రాష్టం సుభిక్షంగా ఉందన్నారు. ఉపాధి హామీ పధకం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ఇటు రాష్టంలోనూ అటు కేంద్రంలోను ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు పుష్కలంగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధికి సంబంధించి చేయాల్సిన పనులను గుర్తించేందుకు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గ్రామసభలు నిర్వహించారన్నారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ షాడోల ద్వారా అక్రమ ఇసుక, గ్రావెల్ దందాలు చేయిస్తూ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు దండుకునే ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ అయ్యాక పిచ్చెక్కి ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి కరపత్రాన్ని అడ్డం పెట్టుకొని తప్పుడు రాతలు రాయిస్తే కోవూరు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఏ ఏ రియల్టర్ల వద్ద నుంచి ఎంత మొత్తం వసూలు చేశారో చిట్టా అంతా తన వద్ద ఉందన్నారు. పనులు చేయకముందే మలిదేవి డ్రైన్ కాంట్రాక్టర్ వద్ద తీసుకున్న అమౌంట్ ఎంతో.. మైపాడు ఫోర్ లైన్ రోడ్డు కాంట్రాక్టర్ వద్ద వసూలు చేసిన మొత్తమెంతో ఆ కాంట్రాక్టర్ల చేతే చెప్పిస్తానన్నారు. తన మంచితనాన్ని చేతకాని తనంగా పరిగణించవద్దని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీలోని కొత్త పాత నాయకుల మధ్య సమన్వయం కోసమే మండలాల వారీగా ఇంచార్జిలను నియమించామని, వారిని అనవసరంగా నిందించడం తగదని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సూచించారు. ప్రజాసేవ చేసేందుకు మాత్రమే రాజకీయాలలోకి వచ్చామని, అడ్డగోలు సంపాదన కోసం రాలేదన్నారు. కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఇంచార్జులుగా తన మనుషులు ఒక్క రూపాయ అవినీతికి పాల్పడినట్లు నిరూపించగలవా అని మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సవాల్ విసిరారు. కోవూరు పరిసరాల్లో మురుగు కాలువల్లో గత 30 ఏళ్లుగా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కనీసం పూడికలు తీయించారా అని ఆమె ప్రశ్నించారు. ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతి భరించలేకే కోవూరు నియోజకవర్గ ప్రజలు తనను 54 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలిపించారన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఖజానా ఖాళీ అయినా… సీఎం చంద్రబాబు సమర్థులు కాబట్టి సంక్షేమ పధకాలు కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. అభివృద్ధి మరియు సంక్షేమమే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడుకి అండగా నిలవాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాళెం అర్బన్, రూరల్ మండల అధ్యక్షులు ఎం.వి.శేషయ్య, బత్తుల హరికృష్ణ, మున్సిపల్ కమీషనర్ చంద్ర శేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మోర్ల సుప్రజ, కౌన్సిలర్ శ్రీదేవి, స్థానిక టిడిపి నాయకులు మాజీ సర్పంచ్ చిరమన ఆంజనేయులు, జొన్నలగడ్డ శివప్రసాద్, రాజేశ్వరమ్మ, హరనాద్, తాల్లస్వామి, ప్రభాకర్, చిరమన వంశి, కంచర్ల మురళి చౌదరి, వెంకటేశ్వర్లు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
