Clock Of Nellore ( Nellore Rural ) – జిల్లా వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉదయం నుండే ఇంటింటికి వెళ్లి వృద్దులు, దివ్యాంగులకు పెన్షన్లు అందజేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 2వ డివిజన్ పెద్ద చెరుకూరులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం అక్కడ జరిగిన ఆత్మీయ సమావేశంలో కోటంరెడ్డి ప్రసంగించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుండే పెంచిన పెన్షన్లు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరారు. పోలవరం పూర్తి చేయడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో రాజధాని అమరావతిని తీర్చిదిద్దేందుకు చంద్రబాబు వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నారని కొనియాడారు. ఇచ్చిన ప్రతీ మాట, ప్రతీ హామీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని కోటంరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.