Clock Of Nellore ( Nellore ) – ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని ఒక ఎంపి స్థానంలో పాటూ పదికి పది అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ ధీమా వ్యక్తం చేశారు. మామూలుగా అయితే 8 స్థానాల్లో విజయం సాధిస్తామని భావించామని, అయితే ఓటింగ్ సరళి చూసిన తర్వాత పదికి పది గెలుస్తామన్న నమ్మకం పెరిగిందన్నారు. నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రతో కలిసి అజీజ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పోలింగ శాతం పెరిగిందని, వైసీపిపై వ్యతిరేకత, భవిష్యత్తుపై నమ్మకంతోనే ప్రజలంతా స్వచ్ఛంధంగా తరలివచ్చి టిడిపికి ఓట్లు వేశారన్నారు. ఓటింగ్ సరళి గమనిస్తే ఉమ్మడి జిల్లాలోని పదికి పది స్థానాలు కైవసం చేసుకునే పరిస్థితి ఉందని ధీమా వ్యక్తం చేశారు. గడచిన ఐదేళ్లలో ప్రతిపక్ష నేతలతో పాటూ సామాన్య ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారని, వైసీపిని ఎలాగైనా ఇంటికి పంపాలనే నిశ్చయంతో ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ కు తరలివచ్చారన్నారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా పూర్తి చేసిన అధికారులకు, పోలీసులకు ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో పలు చోట్ల వైసీపి నేతలు ఓటమిని జీర్ణించుకోలేక టిడిపి అభ్యర్ధులు, నేతలపై దాడులకు తెగబడుతున్నారని, పోలీసు శాఖ దాడులను నివారించాలని కోరారు. జూన్ 4న స్పష్టమైన ఫలితాలు రానున్నాయని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడం ఖాయమని అజీజ్ ధీమా వ్యక్తం చేశారు.