Clock Of Nellore ( Nellore ) – సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈనెల 13న నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరిగే పోలింగ్ ప్రక్రియలో ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న చోట ఓటరు అసిస్టెంట్ బూత్లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ పేర్కొన్నారు. శనివారం నెల్లూరు సిటీ, రూరల్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, కనుపర్తిపాడులోని ప్రియదర్శిని కళాశాలలో పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. తొలుత నెల్లూరు నగరంలోని డికెడబ్ల్యూ కళాశాలలో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను కలెక్టర్ పరిశీలించి, పలు సూచనలు చేశారు. అనంతరం కనుపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను పరిశీలించి, పోలింగ్ విధులకు హాజరయ్యే పోలింగ్ అధికారులు, సిబ్బందికి అందజేయనున్న ఈవీఎంలు, పోలింగ్ మెటీరియల్ మొదలైన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ను అందించాలని సూచించారు. అనంతరం మాగుంట లేఅవుట్లోని ఎస్ఆర్కె హైస్కూల్, మూలాపేటలోని వేద సంస్క్రృత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న చోట ఓటర్లకు సహాయం చేసేందుకు ఓటరు అసిస్టెంట్ బూత్లు ఏర్పాటు చేస్తున్నామని, 13వ తేదీనా ప్రజలందరూ స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు కలెక్టర్ చెప్పారు.
