భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయండి : ఆర్డీఓలకు కలెక్టర్ ఆదేశం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లాలో చేపడుతున్న జాతీయ రహదారులకు, జలవనరుల ప్రాజెక్టులకు, రైల్వే ప్రాజెక్టులకు సంబందించిన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, రెవెన్యూ డివిజనల్ అధికారులను ఆదేశించారు. శనివారం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో భూసేకరణ, అలీనేషన్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ తో కలిసి రెవెన్యూ డివిజన్ అధికారులు, సంబందిత ప్రాజెక్టుల ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి డివిజన్ల వారీగా భూసేకరణ ప్రక్రియ పై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు మంజూరైన వివిధ ప్రాజెక్టులకు కావలసిన భూములను సేకరించడంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ప్రతి ప్రాజెక్టుకు సంబందించి ప్రాజెక్టు వారీగా నిర్ధిష్టమైన గడువును నిర్దారించుకొని ఆ గడువులోగా భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేలా రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలన్నారు. జిల్లాకు మంజూరైన వివిధ ప్రాజెక్టులకు కావలసిన భూములు సేకరించడంతో పాటు అలీనేషన్, అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వడంలో చాలా ఆలస్యం అవుతోoదన్నారు. ఇకనైనా ఎటువంటి జాప్యం చేయకుండా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ప్రక్రియను త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలన్నారు.

నేషనల్ హైవేస్, రైల్వేస్, ఎపిఐఐసి, ఇరిగేషన్ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణలో సంబందిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు. భూ సేకరణలో ఎలాంటి ఆలస్యం జరగరాదని, క్షేత్రస్థాయిలో ఆయా శాఖల అధికారులు పర్యటించి భూసేకరణ ఎంత వరకు వచ్చిందో పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి, సంబందిత ప్రాజెక్టులకు అప్పగించిన భూముల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు. త్వరితగతిన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసి ఆయా ప్రాజెక్టులను మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, రెవెన్యూ, సంబందిత ప్రాజెక్టుల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టర్ ఎస్.ఎస్. శోబిక, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్ సుధాకర్ రావు, నెల్లూరు, కావలి, ఆత్మకూరు ఆర్డిఓలు మలోల, శీనా నాయక్, కరుణకుమారి, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఏపీఐఐసీ, ఆర్.అండ్ బి., రైల్వే , ఇరిగేషన్ అధికారులు, భూ సేకరణ విభాగం కలెక్టరేట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read Previous

స్పెషల్ బ్రాంచ్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన మధుబాబు

Read Next

” U ” టర్న్ తీసుకున్న వేణుగోపాల స్వామి దేవస్ధాన స్థల వివాదం

Leave a Reply

Your email address will not be published.