Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలో రాజకీయ దుమారం రేపిన శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థాన స్థల వివాదం ” U ” టర్న్ తీసుకుంది. వివాదస్పద స్థలం వేణుగోపాల స్వామి దేవస్థానానికి సంభందించి కాదని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అధికారికంగా వెల్లడించారు. తాజా ప్రకటనతో ఈ వివాదం ముదిరి పాకాన పడినట్లయింది. నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులో వేణుగోపాల స్వామి దేవస్థానానికి చెందిన స్థలంలో ఓ మహిళ బంకు ఏర్పాటు చేసిందని దేవస్థాన ఛైర్మైన్ మజ్జిగ చంద్రమౌళి రెడ్డి, ఆలయ ఉద్యోగి రంగరాజు బంకును అక్కడి నుండి తొలగించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ మహిళ తన బంకును తొలగించారని దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో వారిపై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ ఇద్దర్నీ స్టేషన్ కు పిలిపించారు. అదే క్రమంలో స్టేషన్ కు వెళ్లిన మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పోలీసుల తీరును తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. దీంతో స్టేషన్ కు చేరుకున్న జిల్లా ఎస్పీ విజయరావు ఆనంకు సర్ధిచెప్పి, సముదాయించి వెళ్లారు. ఫిర్యాదుపై విచారిస్తామని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆ మహిళ గిరిజన సంఘంతో కలిసి శుక్రవారం బంకు తొలగించిన ప్రదేశంలో నిరసన తెలియజేసింది.
అంత వరకూ బాగానే ఉన్నా తాజాగా ఈ వివాదం ” U ” టర్న్ తీసుకుంది. పోలీసుల విజ్ఞప్తి మేరకు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సర్వే అధికారులు ఆ స్థలంపై పోలీసులకు వివరణ ఇచ్చారు. ఆ మహిళ బంకు పెట్టుకుని ఉన్న స్థలం వేణుగోపాల స్వామి దేవస్థానంకు చెందింది కాదని, అది ఆర్ అండ్ బి మినీ బైపాస్ రోడ్డుకు చెందిన స్థలం అని అధికారికంగా లేఖ అందించింది. అధికారులు అందించిన లేఖ నేపద్యంలో ఈ వివాదం ఎక్కడకు దారి తీస్తుందో వేచి చూడాల్సి ఉంది.

