ప్రతిభావంతులకు అండగా ప్రభుత్వం : ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భరోసా

Clock Of Nellore ( Nellore ) – విద్యార్థులందరూ క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పం అనే మూడు సూత్రాలను శ్రద్దాసక్తులతో ఆచరించి ఉన్నత లక్ష్యాలు అందుకోవాలని నెల్లూరు పార్లమెంటుసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విద్యార్థులకు ఉద్బోధించారు. సోమవారం నెల్లూరు నగరంలోని కస్తూరిదేవీ గార్డెన్స్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో పదోతరగతి, ఇంటర్‌ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్‌ స్టార్స్‌ పేరుతో ప్రతిభా పురస్కారాల ప్రదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, కోవూరు, కావలి ఎమ్మెల్యేలు ప్రశాంతిరెడ్డి, దగుమాటి కృష్ణారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ కె కార్తీక్‌, నగర మేయర్‌ స్రవంతి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 250 మంది, ఇంటర్‌లో 34మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20వేలు విలువ గల చెక్కు, మెడల్‌, సరిఫికెట్లను అతిథులు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ సరికొత్త ఆలోచనలతో విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిభా పురస్కారాలతో విద్యార్థులను సత్కరించి ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉందని, గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబుకు ఎంపీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇది విద్యార్థులకు ఒక స్ఫూర్తిని కలిగించే మంచి కార్యక్రమమన్నారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు మంచి పౌష్టికాహారం కూడా అందిస్తున్నట్లు చెప్పారు. తమ తల్లిదండ్రులను ఆశలను నెరవేర్చేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకుసాగాలన్నారు.

అంధ విద్యార్థుల ఉన్నత విద్యకు ఎంపీ భరోసా… !
జిల్లాలోని భవిత కేంద్రాల ద్వారా విద్యనభ్యసించి టెన్త్‌ ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన అంధ విద్యార్థులను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. వీరి ఉన్నత విద్యకు విపిఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. ఇంకా దివ్యాంగ విద్యార్థులు ఎవరైనా ఉన్నత విద్య అభ్యసించాలంటే తమ ఫౌండేషన్‌ తరపున సహకారం అందిస్తామని చెప్పారు.

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందూ సానుకూల దృక్పథంతో ఉన్నత స్థానాలు అధిరోహించాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల విజయాన్ని ప్రభుత్వం గుర్తించి అభినందించం చాలా సంతోషకరమైన విషయమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ సంక్షేమ, అభివృద్ధిని సీఎం సమపాళ్లలో ముందుకు నడిపిస్తూ విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. విద్యా వ్యవస్థను మంత్రి నారా లోకేష్‌ పునర్నిర్మాణం చేసి సరికొత్త ఆలోచనలతో మంచి సంస్కరణలు తీసుకొస్తున్నారన్నారు. విద్యార్థులందరూ క్రమశిక్షణ, పోటీతత్వంతో తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు.

కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేక విప్లవాత్మక నిర్ణయాలు రాబోయే రోజుల్లో విద్యార్థుల భవిష్యత్‌కు మంచి బాటలు వేస్తాయని చెప్పారు. స్వర్ణాంధ్ర 2047 పేరుతో రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు తీసుకొస్తున్న సంస్కరణలు వారి కలలను సాకారం చేస్తాయన్నారు. విద్యార్థులందరూ తమ భవిష్యత్‌ను తామే అందంగా తయారుచేసుకోవాలని, ఈ దిశగా కష్టపడి విద్యనభ్యసించాలని సూచించారు.

జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ కె. కార్తీక్‌ మాట్లాడుతూ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా మార్చుకుని విద్యార్థులు రాణించాలని సూచించారు. జిల్లాలో విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని చెప్పారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 2వేల స్టూడెంట్‌ కిట్స్‌ సిద్ధం చేశామని, త్వరలోనే వీటిని పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టామన్నారు. కంప్యూటర్‌, మ్యాథ్స్‌, ఇంగ్లీషు ల్యాబ్‌లను ఎంపిక చేసిన పాఠశాలల్లో సిద్ధం చేసినట్లు చెప్పారు. పిఎం శ్రీ పథకం ద్వారా కేంద్రప్రభుత్వ సహకారంతో పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పోషక విలువలు గల పౌష్టికాహారం అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 12 కస్తూర్బగాంధీ బాలికల విద్యాలయాల్లో సుమారు 3200మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారని, 38 భవిత కేంద్రాల ద్వారా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు విద్యనందిస్తున్నట్లు చెప్పారు. ప్రతిభా పురస్కారాల పేరుతో అత్యంత ప్రతిభ గల విద్యార్థులను సత్కరిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులందరూ కూడా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలను సద్వినియోగం చేసుకుని భావిభారత పౌరులుగా తల్లిదండ్రులకు, పాఠశాలలకు, జిల్లాకు మంచి పేరు తేవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీరావు, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, జిల్లా వృత్తివిద్య అధికారి మధుబాబు, ఇంటర్‌మీడియట్‌ అధికారి వరప్రసాద్‌రావు, విద్యాశాఖ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Read Previous

వచ్చే రెండేళ్లలో నెల్లూరు సమగ్ర అభివృద్ధి : మంత్రి నారాయణ వెల్లడి

Read Next

కాకాణికి మరో 14 రోజుల రిమాండ్ పొడిగింపు : కొత్తగా 11 కేసులు నమోదు

Leave a Reply

Your email address will not be published.