Clock Of Nellore ( Nellore ) – మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో 14 రోజుల రిమాండ్ ను పొడిగిస్తూ నెల్లూరులోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది. మూడు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టారు. బెయిల్ మంజూరు చేయాలని కాకాణి తరపు న్యాయవాదులు కోరగా న్యాయమూర్తి తోసిపుచ్చారు. బెయిల్ పిటిషన్ పై వాదనలను వాయిదా వేస్తూ కాకాణి రిమాండ్ ను మరో 14 రోజులు పొడిగించారు. దీంతో పోలీసులు ఆయన్ను నెల్లూరులోని కేంద్ర కారాగారానికి తరలించారు. మరో వైపు కాకాణిపై కొత్తగా మరో 11 కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి సర్వేపల్లి రిజర్వాయర్ లో అక్రమంగా మట్టిని తరలించిన కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డిని వెంకటాచలం పోలీసులు నిందితునిగా చేర్చినట్లు సమాచారం. అలాగే ముత్తుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అనధికారికంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి కృష్ణపట్నం పోర్టుకు రాకపోకలు సాగించే వాహనాల నుండి టోల్ వసూలు చేసినట్లు కూడా కాకాణిపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో పాటూ అక్రమ గ్రావెల్, ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సంబంధించి ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని కూడా కేసు నమోదైంది. మొత్తం మీద కాకాణిపై కొత్తగా 11 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ కేసులకు సంభందించి నెల్లూరు కోర్టులో పిటి వారెంట్లు కూడా దాఖలైనట్లు సమాచారం. పిటి వారెంట్లపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మొత్తానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసుల ఊబిలో చిక్కుకున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది.