Clock Of Nellore ( Nellore ) – రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా రోడ్డు ప్రమాదాల నివారణా చర్యలను సత్వరమే చేపట్టాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులకు సూచించారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ డాక్టర్ అజిత వేజండ్ల నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, ప్రజలకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని కమిటీలోని అధికారులకు సూచించారు. రాంగ్ రూట్ లో వచ్చే ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకొని, వాహనాలను సీజ్ చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. గత సమావేశంలో చర్చించిన విధంగా జిల్లాలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ఎన్‌హెచ్ అధికారులు చాలా వరకు నివారణ చర్యలు చేపట్టారని అభినందించారు. ఇంకా అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు, రేడియం పెయింటింగ్ వేయాలని సూచించారు. నెల్లూరు – కృష్ణపట్నం రోడ్డు మార్గంలో స్పీడ్ బ్రేకర్లు, పనులు వేగంగా పూర్తి చేయాలి అన్నారు. అన్ని మార్గాల్లో కూడా విద్యుత్ లైట్లు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు. నెల్లూరు ఆర్టీసీ బస్టాండు వద్ద లోపలికి వెళ్లేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు బస్సులు నిలపకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
జాతీయ రహదారిపై వాహనాలు నిలపకుండా కృష్ణపట్నం పోర్టు రోడ్డు వద్ద ప్రస్తుతానికి వాహనాలు నిలుపుకోవాలని, త్వరలోనే ప్రభుత్వ భూమిని గుర్తించి వాహనాలు నిలిపేందుకు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ చెప్పారు. నెల్లూరు నగర పరిధిలోని మద్రాసు బస్టాండు, ఆర్టీసీ, ఆత్మకూరు బస్టాండ్, స్టోన్‌హౌస్‌పేట ప్రధాన కూడళ్ల వద్ద రోడ్డు మార్జిన్ ఆక్రమణలు లేకుండా వీధి వ్యాపారులు ఎక్కువ సమయం ఉండకుండా ట్రాఫిక్ నివారణకు మున్సిపల్ కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా పరిశీలించి చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో గత మూడు నెలలుగా జరిగిన ప్రమాదాల తీరుతెన్నులు, నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి చాలా వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఎస్పీ అజిత వేజెండ్ల, పోలీసు అధికారులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. గత మూడు నెలలుగా 98 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ఈ ప్రమాదాలను పూర్తిగా అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం సహకారంతో చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఎఎస్పీలు దీక్ష, సౌజన్య, మున్సిపల్ కమిషనర్ నందన్, ఆర్టీవో మదాని, ఎన్‌హెచ్‌ఎ పిడి ఎంకె చౌదరి, పోలీసుశాఖ అధికారులు, మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
