ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయండి : విద్యార్ధులకు కలెక్టర్ ఆనంద్ పిలుపు

Clock Of Nellore ( Nellore ) – విద్యార్థులందరూ ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ పిలుపునిచ్చారు. సోమవారం భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి నిర్వహించిన పరీక్షా పే చర్చ – 8వ ఎడిషన్‌ కార్యక్రమాన్ని వీడియో ప్రసారం చేయగా నెల్లూరులోని ఈఎస్‌ఆర్‌ఎం నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులతో కలిసి కలెక్టర్‌ వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ సూచించిన విధంగా విద్యార్థులందరూ ఒత్తిడితో కాకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరుకావాలన్నారు. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం నిర్వహించిన పరీక్ష పే చర్చ కార్యక్రమం విద్యార్థుల్లో మరింత స్ఫూర్తి నింపుతుందన్నారు. విద్యార్థులు మానసికంగా, ధృడంగా ఉంటే ఫలితాలు కూడా అనుకూలంగా వుంటాయని చెప్పారు. మోదీ పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులందరూ తమ అమ్మ పేరుతో ఒక మొక్కను నాటి సంరక్షించాలన్నారు. తగిన ప్రణాళికను రూపొందించుకుని క్రమపద్ధతిలో విద్యనభ్యసించాలని, పరీక్షలను భయపడుతూ కాకుండా తాము నేర్చుకున్న పాఠ్యాంశాలను పూర్తిగా అర్థం చేసుకుని రాస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్‌ ఉద్బోధించారు. పదోతరగతి వరకు విద్యార్థులకు లక్ష్యాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండదన్న కలెక్టర్‌, చదువుపై దృష్టిసారిస్తే మంచి లక్ష్యాలు సాధించేందుకు మార్గం ఏర్పడుతుందన్నారు. విద్యార్థులందరూ పరీక్షాపే చర్చ కార్యక్రమంలో ప్రధాని మోదీ సందేశంతో స్ఫూర్తి పొంది ఉత్తమ ఫలితాల సాధనకు ఇప్పటినుంచే సంసిద్ధం కావాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఇవో బాలాజీరావు, సమగ్రశిక్ష ఎపిసి వెంకటసుబ్బయ్య, హెచ్‌ఎం శివరామప్రసాద్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read Previous

నిద్రలేమి సమస్యలతో న్యూరోలాజికల్ రోగాలు : హెచ్చరించిన మెడికవర్ వైద్యులు

Read Next

ఎమ్మెల్యే కోటంరెడ్డి వివాహ దినోత్సవం : అమ్మవారిని దర్శించుకున్న దంపతులు

Leave a Reply

Your email address will not be published.