Clock Of Nellore ( Atmakur ) – బాలిక మిస్సింగ్ కేసును 24 గంటల్లో చేధించి బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించిన నెల్లూరుజిల్లా, ఆత్మకూరు పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. ప్రజల ప్రశంసలు అందుకున్నారు. వివరాల్లోకి వెళితే ఆత్మకూరు పట్టణానికి చెందిన మైనర్ బాలిక స్థానిక సెయింట్ మేరీస్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. బుధవారం మధ్యాహ్నం స్కూల్లో టీచర్ మందలించడంతో మనస్థాపానికి గురైన బాలికి స్కూల్ నుండి వెళ్లిపోయింది. సాయంత్రం ఎంతకీ బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు స్కూలుకు వెళ్లగా అక్కడ కనిపించలేదు. తెలిసిన ప్రదేశాల్లో గాలించిన ఫలితం లేదు. దీంతో వారు ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి బాలిక కోసం గాలించారు. ఎట్టకేలకు ఇవాళ ఉదయం బాలికను ఉదయగిరిలో గుర్తించి స్టేషన్ కు తీసుకొచ్చారు. బాలికను అడిగి వివరాలు తెలుసుకున్నారు. స్కూల్లో ఏదైనా ఇబ్బంది కలిగితే తల్లిదండ్రులకు చెప్పాలని బాలికకు పోలీసు అధికారులు నచ్చజెప్పారు. తల్లిదండ్రులకు సమాచారం అందజేసి బాలికను వారికి అప్పగించారు. అదృశ్యం కేసును 24 గంటల్లో చేధించి బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడంతో పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.