Clock Of Nellore ( Rapur ) – నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, పెంచలకోన సమీపంలో రోడ్డుపై బుధవారం రాత్రి చిరుతపులి దర్శనమిచ్చింది. కొందరు భక్తులు పెంచలకోన ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా అటవీశాఖ పార్కు సమీపంలోని రోడ్డుపై చిరుతపులి కనిపించింది. కారులో తిరిగి వస్తున్న భక్తులు భయంతో కేకలు వేస్తూ కారు హారన్ మోగించారు. రెండు నిముషాల పాటూ రోడ్డుపైనే ఉండిన చిరుత పులి తర్వాత భక్తుల కేకలతో బెదిరి రోడ్డు దాటి అడవిలోకి పారిపోయింది. ఈ పులి దృశ్యాలను కారులో ఉన్న హరీష్ అనే వ్యక్తి సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. మరో వైపు పులి సంచారం విషయం తెలుసుకున్న జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్ బాషా ఆ ప్రాంతంలోని అటవీ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీనిపై డిఎఫ్ఓ మహబూబ్ బాషా మాట్లాడుతూ దేవస్థానం సమీపంలో గానీ, రోడ్డు చుట్టుపక్క ప్రాంతాల్లో ప్రస్తుతం పులి సంచారం లేదని స్పష్టం చేశారు. పులి అడవిలోకి వెళ్లిపోయిందని, భక్తులు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. పెంచలకోన దేవస్థానంతో పాటూ దాని సమీప ప్రాంతాలు, అడవిలోని రహదారుల వెంట అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నిత్యం పర్యవేక్షణ ఉంటుందని డిఎఫ్ఓ స్పష్టం చేశారు.
