Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని గణేష్ ఘాట్ వద్ద ఈనెల 15న నిర్వహించే కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ, టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ విజయలక్ష్మితో కలిసి ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్న గణేష్ ఘాట్ ను కోటంరెడ్డి సందర్శించారు. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఈనెల 15న అక్కడ నిర్వహించే కార్తీక మహా దీపోత్సవం, 108 తెప్పలతో శివాకృతి కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్షించారు. సింహపురి కార్తీక దిపోత్సవ సమితి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అనంతరం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ కాశీ ఘాట్ ను తలపించే విధంగా గణేష్ ఘాట్ లో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 15వ తేదీ సాయంత్రం వేలాది మంది మహిళలు కార్తీక దీపాలను చేతపట్టుకొని శోభాయాత్ర నిర్వహిస్తారన్నారు. తర్వాత గణేష్ ఘాట్ వద్ద గంగా హారతి ఉంటుందని, అదే క్రమంలో 108 తెప్పలతో నెల్లూరు చెరువులో శివాకృతి కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని నెల్లూరు వాసులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.