Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా వైసీపి అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పొదలకూరు మండలంలోని కనుపూరు కాలువ పనుల పరిశీలన కార్యక్రమానికి వెళుతుండగా నెల్లూరులోని వారి నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలను చెదరగొట్టి కాకాణిని గృహ నిర్భంధం చేశారు. గత వైసీపి ప్రభుత్వంలో కనుపూరు కాలువ పనులు చేయకుండానే, చేసినట్లు పత్రాలు సృష్ఠించి కోట్లాది రూపాయలు కాజేశారని అప్పటి టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో టిడిపి ప్రభుత్వం ఏర్పడ్డాక కనుపూరు కాలువ పనులకు శ్రీకారం చుట్టారు. తాజాగా జరుగుతున్న పనులు నాశిరకంగా జరుగుతున్నాయని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మంగళవారం పనుల పరిశీలనకు వెళ్లేందుకు నెల్లూరులోని వారి నివాసం నుండి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు ఆయన్ను గృహ నిర్భంధం చేశారు. మరో వైపు కనుపూరు కాలువ వద్ద వైసీపి కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించగా స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అక్కడి నుండి వెనక్కు పంపారు. వైసీపి నేతలు అక్కడ వేసిన టెంటును తొలగించారు. అలాగే అక్కడే ఏర్పాటు చేసిన వైసీపి ఫ్లెక్సీలను టిడిపి కార్యకర్తలు తొలగించారు.