మహిళను చంపి… శవాన్ని సూట్ కేస్ లో కుక్కి… చెన్నైలో పట్టుబడ్డారు…

Clock Of Nellore ( Chennai & Nellore ) – నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్దురాలికి అతికిరాతకంగా చంపి ఆమె మృతదేహాన్ని సూట్ కేస్ లో కుక్కి అతృశ్యం చేసే క్రమంలో నిందితులు చెన్నైలో పోలీసులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే నెల్లూరు కుక్కల గుంట ప్రాంతానికి చెందిన రమణమ్మ అనే వృద్దురాలు సోమవారం ఉదయం కూరగాయల కోసమంటూ బయటకు వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. సాయంత్రం వరకు వెదికిన కుటుంబ సభ్యులు జాడ తెలియకపోవడంతో సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే క్రమంలో మంగళవారం తెల్లవారు జామున చెన్నై సమీపంలోని మింజూరు రైల్వే స్టేషన్ లో అనుమానస్పదంగా తిరుగుతున్న సుబ్రమణ్యం ఆయన కుమార్తె దివ్యలను రైల్వే పోలీసులు ప్రశ్నించగా ఈ దారుణం వెలుగుచూసింది. కుక్కల గుంట ప్రాంతానికే చెందిన సుబ్రమణ్యం వృద్దురాలు రమణమ్మ నగలపై కన్నేశాడు. సోమవారం ఉదయం కూరగాయలు తీసుకుని ఇంటికి వెళుతున్న రమణమ్మతో సుబ్రమణ్యం మాట కలిపి వారి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో ఆమెను హత్య చేసి ఒంటిపై ఉన్న నగలను తీసుకున్నారు. శవాన్ని ట్రావెల్ బ్యాగులో కుక్కాడు. సోమవారం సాయంత్రం కుమార్తె దివ్యతో కలిసి ఆ సూట్ కేసుతో బయలుదేరాడు. స్థానికులకు ఊరెళ్తున్నట్లు నమ్మించాడు. నెల్లూరు రైల్వే స్టేషన్ కు వెళ్లి సూట్ కేస్ తో పాటూ చెన్నై రైలు ఎక్కారు. చెన్నై సమీపంలోని మింజూరు రైల్వే స్టేషన్ లో జనాలు ఎక్కువ మంది లేకపోవడంతో అక్కడ రైలు దిగేశారు. మంగళవారం తెల్లవారు జామున సూట్ కేస్ ను రైల్వే స్టేషన్ లో వదిలి తిరిగి నెల్లూరుకు చేరుకోవాలని ప్రయత్నించారు. అదే క్రమంలో అక్కడే ఉన్న రైల్వే పోలీసులకు అనుమానం వచ్చి వారిని ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో సూట్ కేసు ను తెరిచి చూడగా వృద్ధురాలి శవం కనిపించింది. తమ శైలిలో విచారణ చేయడంతో అసలు నిజం పోలీసులకు చెప్పాడు. విషయాన్ని చెన్నై పోలీసులు నెల్లూరు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంతపేట పోలీసులు చెన్నై చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మహిళ మృతదేహాన్ని అక్కడే ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించారు.

Read Previous

కార్తీక దీపోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Read Next

అందరి సహకారంతో నగరాభివృద్ధి : కౌన్సిల్ సమావేశంలో నెల్లూరు మేయర్ స్రవంతి

Leave a Reply

Your email address will not be published.