అందరి సహకారంతో నగరాభివృద్ధి : కౌన్సిల్ సమావేశంలో నెల్లూరు మేయర్ స్రవంతి

Clock Of Nellore ( Nellore ) – జిల్లాకు చెందిన అందరు ప్రజా ప్రతినిధుల సహకారంతో, నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారుల పర్యవేక్షణలో నగరాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని నెల్లూరు మేయర్ స్రవంతి పేర్కొన్నారు. నగర పాలక సంస్థ సాధారణ సర్వ సభ్య సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. మేయర్ స్రవంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ప్రవేశపెట్టిన 73 తీర్మానాలను అజెండాగా ప్రకటించగా, 64 తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించారు. అజెండాలో 4 తీర్మానాలను తదుపరి కౌన్సిల్ సమావేశానికి వాయిదా వేయగా, 5 తీర్మానాలను రివైజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ పనులు ప్రణాళికా బద్ధంగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. కార్పొరేషన్ కమిషనర్, అన్ని విభాగాల అధికారులు, సిబ్బందితో పాటు నగర ప్రజలందరి సహకారంతో నెల్లూరు నగర పాలక సంస్థ ఉన్నతి సాధించేలా సమన్వయంగా కృషి చేస్తామని మేయర్ ఆకాంక్షించారు. అనంతరం ప్రజా ప్రతినిధులు తమ డివిజన్ల పరిధిలో ప్రస్తావించిన పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైను కాలువల పూడికతీత, దోమల నిర్మూలన, కుక్కలు, పందులు, పశువుల నియంత్రణతో పాటు స్థానిక సమస్యలను, వివిధ అంశాలను పరిష్కరించేందుకు కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయిలో కృషి చేయాలని మేయర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చంద్ర శేఖర్ రెడ్డి, నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, కమిషనర్ సూర్యతేజ, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Previous

మహిళను చంపి… శవాన్ని సూట్ కేస్ లో కుక్కి… చెన్నైలో పట్టుబడ్డారు…

Read Next

30వ డివిజన్ లో అభివృద్ధి కార్యక్రమాలు : శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

Leave a Reply

Your email address will not be published.