Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లాలోని తీర ప్రాంతాల్లో ఉన్న బీచ్ లను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. తోటపల్లి గూడూరు మండలం, కొత్త కోడూరు బీచ్ వద్ద టూరిజం రిసార్ట్స్ నిర్మిస్తామని పేర్కొన్నారు. వెంకటగిరి పోలేరమ్మ జాతరలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి దుర్గేష్ గురువారం ఉదయం నెల్లూరులోని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడే సోమిరెడ్డితో కలిసి అల్పాహారం చేశారు. కొద్ది సేపు ఆయనతో మాట్లాడారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరుజిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, గడచిన ఐదేళ్ల వైసీపి పాలనలో అవన్నీ నిర్వహణకు నోచుకోలేదన్నారు. త్వరలోనే జిల్లాలోని అన్నీ పర్యాటక ప్రాంతాలకు నూతన శోభ తీసుకొస్తామని స్పష్టం చేశారు. అలాగే సముద్ర తీర ప్రాంత పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే మైపాడు బీచ్ వద్ద టూరిజం రిసార్ట్స్ ఉందని, అదే తరహాలో కొత్త కోడూరు బీచ్ వద్ద కూడా రిసార్ట్స్ నిర్మించి, పర్యాటకులకు ఆకర్షిస్తామన్నారు.