Clock Of Nellore ( Vijayawada ) – వరద భీభత్సానికి గురై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విజయవాడ వరద బాధిత కుటుంబాలకు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బాసటగా నిలుస్తున్నారు. మూడో రోజు 54వ డివిజన్‌లో మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలపై తెలుసుకున్నారు. ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకునేందుకు ఇంటింటికి వెళ్లి వారితో మాట్లాడారు. సంబంధిత అధికారులతో ఫ్లడ్ ఎన్యుమరేషన్ యాప్‌లో వివరాలు నమోదు చేయించారు. నిరుపేదలు నివశించే ప్రాంతాలకు వెళ్లారు. ముంపునకు గురైన ప్రాంతాలను, నష్టపోయిన దుకాణాలను ఇన్యుమెరేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే 4 సచివాలయాల పరిధిలో అడ్మిన్లతో కలిసి ఆయా వివరాలను తెలుసుకున్నారు. 100 శాతం ఎన్యుమరేషన్ పూర్తి చేయాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. పర్యటనలో అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి నారాయణకు చెక్కు అందజేసిన ప్రశాంతి రెడ్డి
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల బాధితులను ఆదుకునేలా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మంచి మనస్సుతో చొరవ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని పలువురు దాతలు అందజేసిన రూ.4 లక్షల విరాళాన్ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖమంత్రి డాక్టర్ పొంగూరు నారాయణకు విజయవాడలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు సూరా శ్రీనివాసులురెడ్డి – సూరా ప్రదీప 50 వేల రూపాయలు, సుంకర ఆదినారాయణ జక్కా వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ తరపున 2 లక్షల రూపాయలు, ఎం.కె. రియల్ ఎస్టేట్ లక్ష 50 వేల రూపాయలను ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి అందజేశారు. ఆ చెక్కును ఎమ్మెల్యే వేమిరెడ్డి నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్, పలువురు టీడీపీ నేతలతో కలిసి విజయవాడకు వెళ్లి మంత్రి నారాయణకు ఇచ్చారు.